Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీది దాదాగిరి.. కేంద్రానిది వ్యతిరేక వైఖరి: కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు…

ఏపీది దాదాగిరి.. కేంద్రానిది వ్యతిరేక వైఖరి: కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు…
-నాగార్జున సాగర్ పర్యటన సభలో కేసీఆర్ ఆగ్రహం
– నాకు కూడా కరోనా వచ్చింది.. అందుకే ఇక్కడకు రావడం ఆలస్యమైందన్నకేసీఆర్
-కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి చేస్తోందని ధ్వజం
-కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఎలా కడుతోందో అందరూ చూస్తున్నారు
-తెలంగాణపై కేంద్రం వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోంది
-హాలియాను అద్భుతంగా తీర్చిదిద్దుతాం
-సాగర్ నియోజకవర్గ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం
-నియోజకవర్గానికి రూ. 150 కోట్లు ఇస్తాం

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరీ చేస్తోందని దుయ్యబట్టారు. కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు ఎలా కడుతోందో అందరూ చూస్తున్నారని అన్నారు. కృష్ణానది నీటికి సంబంధించి రాబోయే రోజుల్లో తెలంగాణకు ఇబ్బంది జరిగే అవకాశం ఉందని చెప్పారు.

అందువల్ల మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని… పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లను తెచ్చుకుందామని అన్నారు. ఈ అనుసంధానానికి సంబంధించిన పనుల కోసం సర్వే జరుగుతోందని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ సెటైర్లు వేశారు. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని తాము చెపితే గతంలో జానారెడ్డి ఎగతాళి చేశారని అన్నారు. అదే జరిగితే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని అన్నారని… తాము 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. కానీ జానారెడ్డి మాత్రం మొన్నటి ఉపఎన్నికలో కాంగ్రెస్ కండువానే కప్పుకుని పోటీ చేశారని చెప్పారు.

హాలియాను అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సాగర్ నియోకజవర్గంలో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని… అన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

నందికొండ మున్సిపాలిటీలో ఉన్న ఇళ్లన్నింటినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున నిధులు ఇస్తానని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రూ. 150 కోట్లు ఇస్తానని చెప్పారు. తాను కూడా కరోనా బారిన పడ్డానని… అందుకే హాలియాకు రావడం ఆలస్యమైందని చెప్పారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. త్వరలోనే గుర్రంపోడు లిఫ్ట్ పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. దీంతోపాటు నెల్లికల్ లిఫ్ట్, దేవరకొండలో ఐదు లిఫ్ట్ లు, మిర్యాలగూడలో ఐదు లిఫ్ట్ లు, నకిరేకల్ అయిటిపాముల వద్ద ఒక లిఫ్ట్ లతో కలిపి నల్గొండ జిల్లాకు మొత్తం 15 లిఫ్ట్ లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ లిఫ్టులన్నింటినీ ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు.

Related posts

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే: షర్మిల

Drukpadam

అడ్డువ‌చ్చిన బాలుడిని తొక్కుకుంటూ వెళ్లిన రాయ‌ల్ గార్డు.. 

Drukpadam

మరాఠా యోధుడు …ఎన్నికల వ్యూహకర్త మధ్య ఏంజరుగుంది ?

Drukpadam

Leave a Comment