Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నిన్నటి దాకా ఒక లెక్క.. నేటి నుంచి మరో లెక్క: ఇంద్రవెల్లి సభలో రేవంత్!

నిన్నటి దాకా ఒక లెక్క.. నేటి నుంచి మరో లెక్క: ఇంద్రవెల్లి సభలో రేవంత్!
-పంచ్ డైలాగులతో సభికులను ఆకట్టుకున్న రేవంత్
-కేసీఆర్‌కు ఇక మిగిలింది 20 నెలలే
-నేను మరో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా
-ప్రజలకు ఏదైనా చేసి చనిపోవాలని నిర్ణయించుకున్నా
-ఇబ్రహీంపట్నంలో ఈ నెల 18న రెండో సభ

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిన్న జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని కేసీఆర్‌ను హెచ్చరించారు. కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి పంపే సమయం ఆసన్నమైందని, ఇక మిగిలింది 20 నెలలేనని అన్నారు. ఆ తర్వాత ఆయనకు చర్లపల్లి జైలే గతి అని హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి స్తూపానికి నివాళి అర్పించిన రోజే దళిత, గిరిజన ఆత్మగౌరవం పేరిట దండోరా సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు రేవంత్ తెలిపారు.

తాను మరో 20 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. తాను నల్లమల బిడ్డనని, చెంచుల కష్టాలను కళ్లారా చూశానని అన్నారు. మరో 20 నెలల్లో రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. సోనియాగాంధీ ఆశీస్సులతో ప్రజలకు ఏదైనా చేసి చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో కొడుకు కోటీశ్వరుడైతే, అల్లుడు అంబానీ, బిడ్డ బిర్లాగా మారి వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. 70 ఏళ్ల కాంగ్రెస్, ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనను పోల్చి చూసుకోవాలని ప్రజలను కోరారు.

హుజూరాబాద్‌లానే మిగిలిన 118 నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు వస్తే దళిత బంధు లాంటి పథకాలు వస్తాయని రేవంత్ అన్నారు. కేసీఆర్ అండతో విశ్రాంత ఐజీ ప్రభాకర్‌రావు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నా, చంద్రమండలంలో ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరించారు. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడతామన్న రేవంత్.. ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో రెండో సభ నిర్వహిస్తామని ప్రకటించారు.

Related posts

ఖమ్మం సంకల్ప సభలో కేసీఆర్ పై షర్మిల నిప్పులు

Drukpadam

మరోసారి బీజేపీ పై సీఎం కేసీఆర్ ఫైర్…

Drukpadam

సంజయ్ అరెస్ట్ అనంతర పరిణామాలపై రంగంలోకి దిగిన ప్రధాని ….

Drukpadam

Leave a Comment