Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పీసీబీ ఆరోపణలపై మేం మాట్లాడదలుచుకోలేదు: గల్లా జయదేవ్!

పీసీబీ ఆరోపణలపై మేం మాట్లాడదలుచుకోలేదు: గల్లా జయదేవ్
-తిరుపతిలో అమరరాజా ప్రెస్ మీట్
-హాజరైన గల్లా రామచంద్రనాయుడు, జయదేవ్
-భవిష్యత్ ప్రణాళికలకు సమయం పడుతుందన్న జయదేవ్
-తమిళనాడులో విస్తరణపై నో కామెంట్

ఏపీ నుంచి అమరరాజా పరిశ్రమ తరలిపోతోందన్న నేపథ్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రెస్ మీట్ లో అమరరాజా గ్రూప్ అధినేత గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. తమిళనాడులో అమరరాజా సంస్థ విస్తరణపై జవాబివ్వాలని ఓ మీడియా ప్రతినిధి కోరగా, గల్లా జయదేవ్ కొంచెం కఠినంగా జవాబిచ్చారు.

ఈ అంశం గురించి ప్రెస్ మీట్లో మూడుసార్లు అడిగారని, తాము మూడుసార్లు సమాధానం చెప్పామని స్పష్టం చేశారు. ఇంతకుమించి తాము దీనిపై ఏమీ చెప్పబోమని అన్నారు. తమ భవిష్యత్ ప్రణాళికలపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని వెల్లడించారు.

అటు, పీసీబీ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు కూడా గల్లా జయదేవ్ ఆసక్తి చూపించలేదు. న్యాయపరిధిలో ఉన్న అంశమని తెలిపారు. అమరరాజా అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారని, వాటిపై అయినా స్పందిస్తారా? అని ఓ దినపత్రిక రిపోర్టర్ అడగ్గా, మ్యాటర్ ఒక్కటే కదా అని అన్నారు. తాము దీనిపై మాట్లాడబోవడంలేదని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు.

అందుబాటులో ఉన్న వనరులతోనే ఎదగాలనుకున్నాం: గల్లా రామచంద్రనాయుడు

అమరరాజా సంస్థల వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రామచంద్రనాయుడు మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు అనేక మెట్లు ఎక్కామని, అందుబాటులో ఉన్న వనరులతోనే ఎదగాలని భావించామని తెలిపారు. బాల్యంలో పశువులు కాసే సమయంలో ప్రపంచం చాలా పెద్దదన్న విషయం తెలిసిందని, ఇప్పటివరకు తమ ఊరే తమకు ప్రపంచం అని పేర్కొన్నారు. చదువుకోవాలన్న కోరికకు అప్పుడే బీజం పడిందని వివరించారు.

తన తండ్రి నుంచి చొరవ, తెగువ వారసత్వంగా తనకు లభించాయని రామచంద్రనాయుడు వెల్లడించారు. తన తండ్రికి చదువు రాకపోయినా, ఎంతో తెలివైనవాడని పేర్కొన్నారు. వ్యవసాయాధారిత ఉపాధి క్రమంగా తగ్గుతున్న విషయం గుర్తించామని, భారతదేశంలో పల్లెల్లో అత్యధికులు అవకాశాల లేమితో బాధపడుతున్నవారేనని, అలాంటి వారికి ఏమైనా చేయూతనివ్వాలని భావించామని వెల్లడించారు. యువతకు వివిధ రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలనేది తమ లక్ష్యమని తెలిపారు.

తన తండ్రి తర్వాత తనను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి మేనమామ సీపీ రాజగోపాలనాయుడు అని, ఆయన నుంచి కూడా అనేక అంశాలు నేర్చుకున్నానని చెప్పారు. తన మేనమామ ఎప్పుడూ పల్లెలు, రైతులు, కూలీల గురించి ఆలోచిస్తుండేవారని తెలిపారు. పల్లె ప్రజలకు ఏదైనా చేయాలన్న దానికి తన తండ్రి, మేనమామలే తనకు స్ఫూర్తి అని స్పష్టం చేశారు.

1985లో తాము తిరుపతి వచ్చామని, ఆ సమయంలో ప్రతిదానికి ఢిల్లీ వెళ్లి లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చేదని రామచంద్రనాయుడు తెలిపారు. అయితే ఎన్టీఆర్ విధానాలతో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. 18 ఏళ్లు అమెరికాలో ఉండి భారత్ తిరిగొచ్చానని, ఆపై తమ పారిశ్రామిక ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగామని వివరించారు.

పరిశ్రమ స్థాపనకు వ్యవసాయ సాగుభూమి వాడరాదని నిబంధన పెట్టుకున్నామని, ఈ క్రమంలో పిచ్చి మొక్కలతో నిండిన భూమిని పచ్చదనంతో నింపామని రామచంద్రనాయుడు వెల్లడించారు. 1985లో చిన్నగ్రామం కరకంబాడిలో పరిశ్రమను విస్తరించామని, అనంతరం తమ స్వగ్రామం పేటమిట్టలో పరిశ్రమ స్థాపించామని వివరించారు. అక్కడ్నించి అమరరాజా పరిశ్రమది 36 ఏళ్ల ప్రయాణమని తెలిపారు.

Related posts

బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో టీఎస్ ప్రజా ప్రతినిధులు!

Drukpadam

భార‌త్ జోడో యాత్ర‌లో ‘విలాసాల విడిది’ ఆరోపణలపై సాక్ష్యంతో కూడిన‌ కాంగ్రెస్ వివ‌ర‌ణ !

Drukpadam

రేపే మహా అసెంబ్లీ లో బల పరీక్ష..!

Drukpadam

Leave a Comment