ఇండియా సహా 20 దేశాలపై సౌదీ నిషేధం
తమ పౌరులకు ,అధికారులకు వర్తించదు
కరోనా నియంత్రణ కోసమేనని వెల్లడి
సౌదీ అరేబియా దేశంలో నానాటికీ కేసులు పెరగటం పట్ల ఆదేశం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అక్కడ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. 20 దేశాల నుంచి తమ దేశంలోకి ప్రయాణికులను రాకుండా నిషేదాజ్ఞలు విధించింది . ఈ జాబితాలో ఇండియాతో పాటు బ్రెజిల్ , అర్జెంటీనా , అమెరికా, బ్రిటన్ , జపాన్, పాకిస్తాన్ , జర్మనీ , స్వీడన్ , స్విట్జార్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ , సౌత్ ఆఫ్రికా , లాంటి దేశాలు ఉన్నాయి. దేశంలో కొత్తగా 310 కేసులు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మొత్తం కేసులు మూడు లక్షల 68 వేలు నమోదు కాగా, 6 వేల మంది చనిపోయారు. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకే ట్రావెల్ బ్యాన్ విధించినట్టు అధికారులు వెల్లడించారు.
ఇదే సమయంలో ఈ 20 దేశాల్లో ఉంటున్న సౌదీ పౌరులు, ప్రభుత్వ అధికారులపై మాత్రం నిషేధం ఉండదని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు విధించిన నిబంధనలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ ఆరోగ్య మంత్రి తాఫిక్ అల్ రబియా హెచ్చరించారు.