నూరేళ్లు కాదు, 180 ఏళ్లు బతకాలని… వ్యాపారవేత్త డేవ్ ఆస్ప్రే
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బ్రాండ్ వ్యవస్థాపకుడి బయో హ్యాకింగ్!
స్టెమ్ సెల్స్ థెరపీతో నిత్య యవ్వనం అంటున్న డేవ్ ఆస్ప్రే
మరో 133 ఏళ్లు బతకాలని ఆకాంక్ష
తన ప్రయోగాలకు ఇప్పటికే 13 కోట్లు వ్యయం చేసిన ఘనుడు
మానవుడి సగటు ఆయుర్దాయం సంగతి అటుంచితే, వీలైనంత ఎక్కువ కాలం బతకాలని మానవుడు కోరుకుంటాడు. అయితే, అమెరికాకు చెందిన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బ్రాండ్ వ్యవస్థాపకుడు డేవ్ ఆస్ప్రే మాత్రం 180 ఏళ్లు జీవించాలని కోరుకుంటున్నాడట .ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న నిజమే . అందుకు ఆయన ప్రయత్నాలు కూడా ప్రారంభించారు.
ప్రస్తుతం ఆస్ప్రే వయసు 47 సంవత్సరాలు. జీవశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అండతో వందేళ్లకు పైగా బతకాలని తహతహలాడుతున్నాడు. అందుకోసం ఆరు నెలలకు ఓసారి బోన్ మ్యారో (ఎముక మజ్జ)లో కొంత భాగాన్ని తొలగించి, దాని నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ (మూల కణాలు)ను దేహం మొత్తానికి ఎక్కించుకుంటున్నాడు. తద్వారా ఇంకా 133 ఏళ్ల వరకు బతుకుతానని ఆస్ప్రే నమ్ముతున్నాడు. కాగా, ఈ విధానంలో తరచుగా కోల్డ్ క్రియోథెరపీ అవసరమవుతుందని వెల్లడించారు. కోల్డ్ క్రియోథెరపీ అంటే… అత్యంత శీతల వాతావరణం ఉండే కోల్డ్ చాంబర్ లో కూర్చోవాలి. ద్రవరూప నైట్రోజన్ శరీరాన్ని బాగా చల్లబరుస్తుది. ఆ సమయంలో తలకు ఎలక్ట్రోడ్ లు అమర్చుకుని ఇన్ ఫ్రారెడ్ కాంతి కిరణాల కింద గడపాల్సి ఉంటుంది. ఇలా తరచుగా చేయడం వల్ల శరీరం నిత్య యవ్వనంగా ఉంటుందని ఆస్ప్రే చెబుతున్నాడు. అయితే, ఈ వినూత్న వైద్య ప్రక్రియల కోసం ఈ వ్యాపారవేత్త ఇప్పటివరకు రూ.13 కోట్ల వరకు ఖర్చు చేశాడట ఈ ఘనుడు . తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని, అందుకే సాధ్యమైనంత ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నానని ఆస్ప్రే చెబుతున్నాడు. చాలామంది ఈ వ్యాపారవేత్తను ఓ పిచ్చోడి కింద జమకడుతుంటే, తనను తాను ఓ బయోహ్యాకర్ గా అభివర్ణించుకుంటున్నాడు.