తాలిబన్లపై సమరశంఖం పూరించిన పంజ్ షీర్ యోధులు!
-తాలిబన్లకు లొంగని పంజ్ షీర్ లోయ
-యుద్ధానికి సిద్ధమంటున్న పంజ్ షీర్ సాయుధులు
-మద్దతు పలుకుతున్న ఆఫ్ఘన్ ప్రజలు, తజకిస్థాన్
-గతంలో అనేక పోరాటాల్లో పంజ్ షీర్ యోధులదే పైచేయి
ఆఫ్ఘనిస్థాన్ లో నాడు సోవియట్ యూనియన్ నుంచి నేడు తాలిబన్ల వరకు కొరకరాని కొయ్యగా మారింది ఎవరని అంటే పంజ్ షీర్ ప్రావిన్స్ ప్రజల గురించే చెప్పాలి. ఇక్కడి ప్రజలు ఎంతో తెగువ చూపిస్తారు. యుద్ధం అన్నా, ప్రాణాలు అన్నా వారికి లెక్కలేదు. అన్నింటికి మించి బయటివారు ఇక్కడికి ప్రవేశించలేనంతగా పంజ్ షీర్ ప్రాంతానికి భౌగోళిక అనుకూలతలు ఉన్నాయి. ఇక్కడి పర్వత ప్రాంతాల్లోకి శత్రువులు ప్రవేశిస్తే తిరిగి వెళ్లడం చాలా కష్టమని గతంలో జరిగిన యుద్ధాలు నిరూపించాయి.
తాజాగా తమపై తాలిబన్లు దురాక్రమణకు యత్నిస్తే తగిన బుద్ధి చెబుతామని పంజ్ షీర్ యోధులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్లకు లొంగేదిలేదని ఉద్ఘాటిస్తున్నారు. ఇప్పటికే తాలిబన్ వ్యతిరేక నార్తర్న్ అలయెన్స్ కూడా పంజ్ షీర్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ప్రస్తుతం పంజ్ షీర్ లోయలోనే ఉన్నారు.
తాలిబన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇతర ప్రావిన్స్ ల్లోని ప్రజలు కూడా పంజ్ షీర్ సాయుధులకు మద్దతు పలుకుతున్నారు. ఆఫ్ఘన్ తో సరిహద్దులు పంచుకుంటున్న తజకిస్థాన్ కూడా పంజ్ షీర్ యోధులకు సంఘీభావం తెలిపింది.
తాలిబన్ ప్రభుత్వాన్ని ఆమోదించాలంటే షరతులు ఫాలో కావాల్సిందే: అమెరికా
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఇప్పట్లో ఆమోదించేది లేదని అమెరికా తేల్చి చెప్పింది. నాటో మిత్రదేశాలన్నీ తన బాటలోనే నడిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అంత తొందరేం లేదని పేర్కొంది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి దీనిపై ప్రకటన చేశారు.
తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపునివ్వాలంటే గతంలో అమెరికా చెప్పినట్టు కొన్ని విషయాలకు వారు హామీనివ్వాలని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులకు ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్లు ఆశ్రయం ఇవ్వొద్దన్నారు. మానవ హక్కులు, మహిళల స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని చెప్పారు.
కాగా, ఆఫ్ఘనిస్థాన్ లో రాయబార కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాలను కొనసాగించాల్సిందిగా తాలిబన్లు కోరుతున్నారని, కానీ, ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. అమెరికన్లకు భద్రత కల్పిస్తామని తాలిబన్లు మాటలకే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.