గెలుపే టార్గెట్ గా హుజురాబాద్ లో అధికార పక్షం హడావుడి…
-ప్రజాకర్షక పథకాలతో హల్చల్ చేస్తున్న టీఆర్ యస్
– ఎస్సీల దళిత బందు కు 2 వేల కోట్ల
-కులాల వారీగా పథకాల రూపకల్పన
-గెలుపే లక్ష్యంగా పదవుల పందారం
హరీష్ ప్రతిపాదనకు ఒకే చెప్పిన కేటీఆర్
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే దళితులను తమవైపు తిప్పుకునేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రకటించి.. దానికోసం రూ.2వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు రెడ్డి సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు పాడి కౌశిక్ రెడ్డికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించింది. యాదవ సామాజిక వర్గం లక్ష్యంగా గెల్లు శ్రీనివాస యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.
ఈ క్రమంలోనే తాజాగా పద్మశాలీలను టార్గెట్ చేసుకుని కొత్త ప్లాన్‌లు రచిస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో పద్మాశాలి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 26350 ఉన్నాయి. వీరిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా సమీకరణాలు జరుపుతోంది. శనివారం మంత్రి హరీష్ రావు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేసి పద్మశాలీల కోసం చేపట్టాల్సిన చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పద్మశాలి కుల ప్రతినిధులు మాజీ మంత్రి ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్‌ల నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.
నేతన్నల సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పథకాల గురించి ప్రతిపాదనలు తయారుచేసి మంత్రి కేటీఆర్‌కు పంపగా ఆయన వెంటనే ఆమోదించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సిరిసిల్ల జిల్లాలో పర్యటించినప్పుడు రైతు భీమా మాదిరిగానే నేత కార్మికులకు కూడా భీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి ఈ పథకాన్ని అమల్లో పెట్టనున్నారు.
థ్రిఫ్ట్ ఫండ్‌తోపాటు, చేనేత మిత్ర పథకాలను పునరుద్ధరించేందుకూ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ మూడు పథకాలతో పాటు స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలు, నేత కార్మికుల అవసరాలపై కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని వెంటనే నెరవేర్చడమే లక్ష్యంగా ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించారు. ఈ పథకాలను అమలు చేయడం వల్ల హుజురాబాద్‌లోని 26,350 మంది ఓటర్లలో ఎక్కువ మంది తమవైపు తిప్పుకోవాలని అధికార పార్టీ యోచిస్తోంది.