తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..ఒత్తిడి చేయొద్దని ఆదేశం!
-గురు కులాలు ,హాస్టల్స్ ఎట్టి పరిస్థిల్లోనూ తెరవద్దు
-ప్రత్యక్ష తరగతుల కోసం ఒత్తిడి చేయొద్దని ఆదేశం!
-సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లను తెరవాలని టీఎస్ ప్రభుత్వ ఆదేశాలు
-నిర్ణయాన్ని విద్యా సంస్థలకే వదిలేయాలన్న హైకోర్టు
-థర్డ్ వేవ్ ప్రమాదం పై ఆందోళన వ్యక్తం అవుతున్న కోర్ట్
-ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలపాలని ఆదేశం
– అక్టోబర్ 4 న తిరిగి విచారణ …..
పాఠశాలలు తెరవాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్ట్ విచారణ చేపట్టింది. అయితే సెప్టెంబర్ 1 పాఠశాలలు తెరవచ్చునని అయితే ఎటువంటి బలవంతపు విధానం ఉండరాదని హైకోర్టు పేర్కొన్నది. అదే సందర్భంలో ఆన్ లైన్ క్లాస్ ల విధానాన్ని కొనసాగించాలని తెలిపింది. హాస్టల్స్ ,గురుకుల పాఠశాలలు ఎట్టి పరిస్థిల్లోనూ తెరవద్దని ఆదేశించింది.
రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులపై ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా ఎలాంటి హామీలు తీసుకోరాదని చెప్పింది. ప్రత్యక్ష తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకూడదని ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఆన్ లైన్ బోధనను కొనసాగించాలని ఆదేశించింది.
ప్రత్యక్ష తరగతులను నిర్వహించని పాఠశాలలపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్కూళ్లకు రావాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని చెప్పింది. ఆన్ లైన్, లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించాలనుకునే పాఠశాలలకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాలి… వారంలోగా మార్గదర్శకాలను విడుదల చేసి, ప్రచారం చేయాలని ఆదేశించింది.
గరుకులాలు, హాస్టళ్లను కూడా తెరవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, హాస్టళ్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలో కరోనా ఇంకా తగ్గలేదని.. మూడో దశ ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఉన్నాయని చెప్పింది. అలాగే విద్యా సంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయని తెలిపింది. రెండింటినీ సమన్వయం చేసి చూడాల్సిన అవసరం ఉందని చెప్పింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
రేపటి నుంచి స్కూళ్లను రీఓపెన్ చేస్తున్న నేపథ్యంలో హైకోర్టులో పిల్ దాఖలైంది. కరోనా వైరస్ తగ్గిందని చెప్పడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని పిటిషన్ దారుడు తన పిటిషన్ లో ప్రశ్నించారు. స్కూళ్లలో చిన్న వయసు పిల్లలు ఉంటారని… వైరస్ వల్ల వారు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
స్కూల్లో సిబ్బంది, విద్యార్థులు అందరూ కలిపితే… వందల మంది ఉంటారని… దీని వల్ల కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో… ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష బోధన వద్దని కోర్టును కోరారు.