Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే.. తేల్చేసిన సీ-ఓటర్ సర్వే!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే.. తేల్చేసిన సీ-ఓటర్ సర్వే!
-యూపీలో సీట్లు కొంచెం తగ్గినా ఢోకా లేదు
-గోవాలో తిరిగి కమల ప్రభుత్వమే
-మణిపూర్‌ కూడా బీజేపీ ఖాతాలో చేరిక
-ఉత్తరాఖండ్‌లో ఎన్డీయేకు 46 సీట్లు
-పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా ఆప్

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే గెలుస్తుందని ఏబీపీ-సీఓటర్ సర్వే తేల్చింది. 2022లో ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఒక్క పంజాబ్ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటిలో బీజేపీనే అధికారం చేపడుతుందని ఈ సర్వే జోస్యం చెప్పింది. అలాగే పంజాబ్‌లో అంతర్గత కలహాలతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రాబల్యం కొద్దిగా తగ్గిందని తెలిపిన ఈ సర్వే.. దీని వల్ల ప్రభుత్వంలో మార్పు మాత్రం రాబోదని చెప్పింది. గతంతో పోల్చుకుంటే ఒక 60 సీట్లు బీజేపీ కోల్పోతుందని, మొత్తమ్మీద 259 నుంచి 267 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)కి 109 నుంచి 117 సీట్లు వస్తాయని, బీఎస్పీ కేవలం 12 నుంచి 16 సీట్లు మాత్రమే గెలుస్తుందని తెలిపింది. అదే సమయంలో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం 3 నుంచి 7 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది.

గోవా పీఠం మళ్లీ బీజేపీకే దక్కనుందని ఈ సర్వే పేర్కొంది. బీజేపీ సుమారు 39.4 శాతం ఓట్లతో అధికారం నిలబెట్టుకుంటుందని తెలిపింది. ఇక్కడ ఆప్‌కు 22.2 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 15.4 శాతం ఓట్లు మాత్రమే పడతాయని వివరించింది. సీట్ల విషయానికొస్తే.. బీజేపీ 22 నుంచి 26, ఆప్‌ 4 నుంచి 8, కాంగ్రెస్‌ 3 నుంచి 7 స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది.

మణిపూర్‌లో కూడా బీజేపీనే ఆధిక్యంలో నిలుస్తుందని ఏబీపీ సీ-ఓటర్ సర్వే స్పష్టంచేసింది. ఇక్కడ బీజేపీకి 40.5 శాతం ఓట్లు పడతాయని ఊహించింది. కాంగ్రెస్ ఈసారి 34.5 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమవుతుందని చెప్పింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్‌కు 18 నుంచి 22 సీట్లు వస్తాయని తెలిపింది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో బీజేపీ ప్రాభవం తగ్గడంతో 11 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. ఇక్కడ బీజేపీ కూటమికి 46 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 21 సీట్లు వస్తాయని వివరించింది.

అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ హవా సాగిస్తుందని ఈ సర్వే జోస్యం చెప్పింది. ప్రస్తుతం ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈసారి 38 నుంచి 46 సీట్లకే పరిమితం అవుతుందని, ఆప్ మాత్రం 51 నుంచి 57 వరకూ సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే పేర్కొంది. అంటే ఇక్కడ ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనుందన్నమాట.

Related posts

సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కన్నా జానారెడ్డికి ప్రతిష్టాత్మకం

Drukpadam

గుజరాత్ సీఎం రేసులో ముందున్నప్రఫుల్ ఖోదా పటేల్, ఆర్‌సీ ఫాల్దు ?

Drukpadam

సాగర్ బరిలో సానుభూతికే కేసీఆర్ మొగ్గు

Drukpadam

Leave a Comment