ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆదరణ ఉన్న దేశాధినేత ప్రధాని మోదీయే!: ‘మార్నింగ్ కన్సల్ట్’ సర్వేలో వెల్లడి…
-ప్రపంచంలోని 13 మంది నేతల్లో మోదీ నంబర్ 1
-ప్రజల్లో 70 శాతం మందికి ఆయనపై ఆదరణ
-చివరి స్థానంలో జపాన్ ప్రధాని
ప్రధాని మోదీ ప్రభ ఇప్పటికే వెలిగిపోతోంది. ఆయన హవా కొనసాగుతూనే వుంది. అమెరికా సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ తాజాగా వెల్లడించిన ఓ సర్వే గణాంకాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ప్రపంచంలోని 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడే మోదీయేనని తేలింది. ప్రజల్లో 70 శాతం మంది ఆయనపై ఆదరణ కనబర్చారు.
అలాగే, సర్వేలో పాల్గొన్న వయోజనుల్లో 25 శాతం మంది మాత్రమే ఆయన పట్ల వ్యతిరేకత కనబరిచారు. వారానికి ఒకసారి ఈ గణాంకాలను అప్ డేట్ చేస్తుంటారు. ఈ జాబితాలో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి ఉన్నారు.
అంతకు ముందు ‘మార్నింగ్ కన్సల్ట్’ వెల్లడించిన ఫలితాల్లోనూ ప్రజామోదంలో మోదీయే అగ్రస్థానంలో నిలిచారు. 2019 ఆగస్టులో మోదీ ప్రజాదరణ 82 శాతంగా ఉండేది. జూన్‌లో మోదీ ప్రజాదరణ 66 శాతానికి తగ్గగా, ఇప్పుడు మళ్లీ ఆయన తన అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూనే 70 శాతానికి దాన్ని మెరుగుపర్చుకున్నారు. ఇక అత్యధిక మంది తిరస్కరిస్తోన్న ప్రధానిగా జపాన్ ప్రధాని సుగా నిలిచారు. ఆయనను 64 శాతం మంది వ్యతిరేకిస్తుండడం గమనార్హం.