జకార్తా జైలులో ఘోర అగ్నిప్రమాదం… 41 మంది ఖైదీల సజీవదహనం
-ఈ వేకువ జామున ఘటన
-టాంగెరాంగ్ జైలు సి బ్లాక్ లో చెలరేగిన మంటలు
-ప్రమాదం జరిగిన సమయంలో సి బ్లాక్ లో 122 మంది
-క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు
ఇండోనేషియా రాజధాని జకార్తాలోని టాంగెరాంగ్ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 41 మంది ఖైదీలు మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వేకువ జామున జైలులోని సి బ్లాక్ లో మంటలు వ్యాపించడంతో తమ గదుల్లో ఉన్న ఖైదీలు తప్పించుకునే మార్గం లేక విలవిల్లాడారు. అధికారులు స్పందించినప్పటికీ, అప్పటికే పదుల సంఖ్యలో ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.
టాంగెరాంగ్ జైలును 1225 మంది ఖైదీలు ఉండడానికి వీలుగా నిర్మించినా, దీంట్లో ప్రస్తుతం 2 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సి బ్లాక్ లో ప్రమాదం జరిగిన సమయంలో 122 మంది ఖైదీలు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
జైళ్లలో ఘర్షణలు, తద్వారా ఇలాంటి అగ్నిప్రమాదాలు సంభవించడం ఇండోనేషియాలో సర్వసాధారణం. ఈ కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టాంగెరాంగ్ జైలులో ఎక్కువగా మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారిని ఖైదు చేస్తుంటారు.