Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

సీఎం జగన్ బంధువులు భూకబ్జా ఆరోపణలపై స్పందించిన సీఎంఓ!

సీఎం జగన్ బంధువులు భూకబ్జా ఆరోపణలపై స్పందించిన సీఎంఓ
అక్బర్ సెల్ఫీ వీడియోపై విచారణకు ఆదేశం
అక్బర్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీకి ఆదేశం
సీఐని విధుల నుంచి తప్పించామన్న ఎస్పీ
అక్బర్ కుటుంబానికి రక్షణ కల్పిస్తామన్న ఎస్పీ

మైదుకూరులో అక్బర్ బాషా భూమిని జగన్ బంధువు కబ్జా చేశారు : చంద్రబాబు

పొలం వివాదానికి సంబంధించి అక్బర్ బాషా కుటుంబసభ్యుల సెల్ఫీ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి అక్బర్ భూమిని కబ్జా చేశారని… ఆయనకు సీఐ సహకరించారని చంద్రబాబు ఆరోపించారు.

మరోవైపు ఈ అంశంపై సీఎం కార్యాలయం స్పందించింది. అక్బర్ బాషా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. దీంతో అక్బర్ కుటుంబసభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అనంతరం కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను అక్బర్ కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అక్బర్ ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించామని చెప్పారు. దువ్వూరు పోలీసుల సహకారంతో వారిని కాపాడగలిగామని అన్నారు. అదనపు ఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో విచారణ చేపట్టామని చెప్పారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని అన్నారు.

విచారణ పూర్తయ్యేంత వరకు సీఐ కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఈ వ్యవహారంలో సీఐకానీ, ఇతర పోలీసుల తప్పు కానీ ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్బర్ కుటుంబానికి పూర్తి భద్రతను కల్పిస్తానని తెలిపారు. కాగా దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు

మైదుకూరులో అక్బర్ బాషా భూమిని జగన్ బంధువు కబ్జా చేశారు : చంద్రబాబు
అక్బర్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మైదుకూరులో ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందని ఆయన అన్నారు. ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైపోయిందని విమర్శించారు.

ఇక్కడ కూడా తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సీఐ ఒకరు… అక్బర్ ను స్టేషన్లో కూర్చోబెట్టి, అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారని చంద్రబాబు తెలిపారు. పైగా ఎన్ కౌంటర్ చేస్తానని బాధితుడిని బెదిరించడం ఇంకా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి ఇంకెవరు దిక్కు? అని ప్రశ్నించారు.

గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని… ఇప్పుడు అక్బర్ కుటుంబం కూడా తమకు అదే దిక్కంటోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలంటూ అక్బర్ కు సూచించారు. మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్బర్ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

అమెరికాలో హైదరాబాదీ వివాహిత ఆత్మహత్య

Ram Narayana

ఆంధ్ర రాజకీయాల్లోకి ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి …గుడివాడిపై గురి …

Drukpadam

కేసీఆర్‌తో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, రాకేశ్ తికాయ‌త్‌ల భేటీ!

Drukpadam

Leave a Comment