ఒకసారి ఆ పని చేస్తే జనం ఎగబడతారు.. ఆధార్ సంఖ్యను మార్చలేం: స్పష్టం చేసిన ‘ఉడాయ్’!
-తన ఆధార్ సంఖ్యను మార్చాలంటూ కోర్టుకెక్కిన వ్యాపారి
-ఒకసారి చేస్తే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడతారు
-ఆధార్ సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందన్న ఉడాయ్
తనకు కేటాయించిన ఆధార్ సంఖ్యను మార్చాలంటూ ఓ వ్యాపారి కోర్టుకెక్కిన కేసులో ఆధార్ ప్రాధికార సంస్థ (ఉడాయ్) కీలక ప్రకటన చేసింది. ఒకసారి కేటాయించిన సంఖ్యను మార్పు చేసి కొత్తది కేటాయించడం జరగబోదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఒకసారి ఇలాంటి వాటికి అనుమతిస్తే ఇది అలవాటుగా మారుతుందని, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లలా తమకు కూడా ఫ్యాన్సీ నంబరు కేటాయించాలని ప్రతి ఒక్కరు కోరే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి ఒకసారి ఆధార్ నంబరు కేటాయిస్తే అదే ఫైనల్ అని, అందులో ఎలాంటి మార్పు చేర్పులకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
తన ఆధార్ నంబరు గుర్తు తెలియని విదేశీ సంస్థలకు అనుసంధానం కావడంతో ఇబ్బందులు వస్తున్నాయని, కాబట్టి తనకు మొదట కేటాయించిన నంబరును రద్దు చేసి కొత్తది కేటాయించేలా ఉడాయ్‌ను ఆదేశించాలని కోరుతూ ఓ వ్యాపారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్ విచారణకు రాగా, ఉడాయ్ తరపున హాజరైన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డుదారులు అందించిన సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మాసనానికి తెలిపారు.