Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆకస్మిక రాజీనామా :బీజేపీ ముఖ్యమంత్రుల్లో నాల్గవవారు!

గుజరాత్ ముఖ్యమంత్రి ఆకస్మిక రాజీనామా :బీజేపీ ముఖ్యమంత్రుల్లో నాల్గవవారు!
-తన రాజీనామా వెనుక కారణాన్ని వెల్లడించిన విజయ్ రూపానీ
-గుజరాత్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం
-గవర్నర్ కు రాజీనామా పత్రం అందజేత
-అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నది బీజేపీ సిద్ధాంతం
-అందుకు అనుగుణంగానే రాజీనామా చేశానన్న రూపానీ
-ప్రధాని మోడీకి కృతజ్నతలు

గుజరాత్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను నెరవేర్చానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రాజీనామా చేశారు, అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేశారు. కాగా తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. అసెంబ్లీ పదవీ కాలం మరో ఏడాది ఉండగానే తన కేబినెట్‌ను విరమించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, తనకు గుజరాత్ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ణతలు తెలియజేస్తున్నట్లు రాజీనామా అనంతరం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ రూపానీ పేర్కొన్నారు.

మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న విజయ్ రూపానీ రాజీనామా చేయడంపై రాజకీయంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరో ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిని నియమిస్తారా లేదంటే.. రాష్ట్రపతి పాలన కొనసాగిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

మోదీ ప్రధానమంత్రిగా ఎన్నికైన అనంతరం గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్‌ను నియమించారు. అయితే రెండేళ్ల పదవీకాలం పూర్తవ్వగానే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఇక 2016, ఆగస్టు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ రూపానీ.. సెప్టెంబర్ 11న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవరత్‌కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నది బీజేపీ అధిష్ఠానం సిద్ధాంతమని, అందుకు అనుగుణంగానే తాను రాజీనామా చేశానని రూపానీ వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా, చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు. సీఎంగా గుజరాత్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, వచ్చే ఎన్నికల్లోనూ మోదీ నాయకత్వంలో తమదే విజయం అని ఉద్ఘాటించారు. సీఎం ఎవరైనా మోదీ మార్గదర్శనంలో పనిచేస్తామని రూపానీ స్పష్టం చేశారు. గుజరాత్ బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలసికట్టుగానే ఉన్నామని అన్నారు.

విజయ్ రూపానీ 2016 నుంచి గుజరాత్ సీఎంగా ఉన్నారు. అటు, వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, కొత్త సీఎంతో ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ యోచనగా కనిపిస్తోంది. నూతన ముఖ్యమంత్రి రేసులో మన్సుఖ్ మాండవీయ (ప్రస్తుత కేంద్రమంత్రి),నితిన్ పటేల్ (గుజరాత్ డిప్యూటీ సీఎం), ఆర్సీ ఫాల్దు (గుజరాత్ మంత్రి) ఉన్నారు.

Related posts

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌!

Drukpadam

మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి …

Drukpadam

నో డౌట్ మరో పదేళ్లు కేసీఆర్ సీఎం -హరీష్ రావు

Drukpadam

Leave a Comment