సీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై సదస్సు.. జగన్‌పై విరుచుకుపడిన టీడీపీ నేతలు
- సదస్సులో పాల్గొన్న పలువురు టీడీపీ సీనియర్ నేతలు
- కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావడంలో జగన్ విఫలం
- రాయలసీమకు శాపంగా మారిన వైఎస్సార్ నిర్ణయం
- జగన్ అసమర్థతకు ఇది నిదర్శనమన్న నేతలు
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమ జిల్లాల టీడీపీ నేతలు నిన్న అనంతపురంలో నిర్వహించిన సదస్సులో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న నీటి ఒప్పందాలను అమలు చేసేలా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై జగన్ ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు ఏపీ విభజన చట్టంలో ఉన్నాయని, పార్లమెంటు కూడా వీటికి ఆమోద ముద్ర వేసిందని గుర్తు చేశారు. కానీ కేంద్రం తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో వీటికి ఆమోదం లేదనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అసమర్థతకు ఇది నిదర్శమన్నారు.
వైఎస్సార్ హయాంలో కృష్ణా మిగులు జలాలపై హక్కులు వదులుకుంటామని చెప్పడం రాయలసీమకు శాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను తెలంగాణ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటోందని, అయినా జగన్ చోద్యం చూస్తున్నారు తప్పితే అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. హంద్రీనీవాపై వైసీపీ ఎమ్మెల్యేలు నోరెత్తకపోవడం దారుణమైన విషయమని దుమ్మెత్తిపోశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు, మాజీ మంత్రులు అమరనాథ్‌రెడ్డి, కేఈ ప్రభాకర్, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.