కరోనా లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ ఆస్ట్రేలియాలో రోడ్డెక్కిన ప్రజలు..
-ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
-మెల్‌బోర్న్‌లో రోడ్డెక్కిన 1000 మందికిపైగా నిరసనకారులు
-ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
-పెప్పర్ స్ప్రే ప్రయోగించిన పోలీసులు
-సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్‌లోనూ నిరసనలు
ఆస్ట్రేలియా నిరసనలతో అట్టుడుకుతోంది. …. కరోనా నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలో లాక్ డౌన్ విధించడం ప్రజలకు చిరాకు తెప్పిస్తుంది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కంటిన్యూగా వారాలతరబడి లాక్ డౌన్ కొనసాగించడంపై ప్రజలు తిరగబడుతున్నారు. మెల్బోర్న్ లో లాక్ డౌన్ కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లు ఎక్కారు . నిరసనలు తెలిపారు. ఒక్క మెల్బోర్న్ లోనే కాదు అనేక ప్రధాన నగరాలలో ప్రజలు లాక్ డౌన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. నిరసన కారులపై పోలిసులు లాఠీ ఛార్జ్ , అరెస్టులు లాంటి చర్యలకు పూనుకుంటున్నారు.
ఆస్ట్రేలియాలో కరోనా లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. ఆంక్షల చట్రంలో ఇంకెంతకాలం బందీగా ఉండాలని ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరసనకు దిగారు. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మెల్‌బోర్న్ సహా పలు నగరాల్లో కరోనా వైరస్ మళ్లీ చెలరేగుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించి, ఆంక్షలు విధించింది. మెల్‌బోర్న్‌లో గత నెల 6వ తేదీ నుంచి లాక్‌డౌన్ అమల్లో ఉంది. నిన్న అక్కడ 535 కేసులు నమోదు కాగా, 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లాక్‌డౌన్‌లో బతకడం తమ వల్ల కాదని, వెంటనే దానిని ఎత్తివేయాలంటూ మెల్‌బోర్న్‌లో దాదాపు వెయ్యిమంది రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో రెండువేల మంది పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించి చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, నిరసనకారులు కూడా పోలీసులపై దాడికి దిగి రాళ్లు, సీసాలు వారిపైకి రువ్వారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారుల దాడిలో 10 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. 235 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్‌లోనూ లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. సిడ్నీలో 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.