రెండు పార్టీలు నాకు రాజ్యసభ ఆఫర్లు ఇచ్చాయి… అయినా తిరస్కరించా: సోను సూద్!
-రాజకీయాల్లో ప్రవేశించేందుకు నేను సిద్ధంగా లేను
-ఐటీ అధికారులు అడిగిన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చాను
-నేను చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తిని
ప్రముఖ సినీ నటుడు సోను సూద్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. తనకు రెండు రాజకీయ పార్టీలు రాజ్యసభ ఆఫర్లు ఇచ్చాయని… అయినా ఆ ఆఫర్లను తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించేందుకు మానసికంగా తాను సిద్ధంగా లేకపోవడమే దానికి కారణమని అన్నారు.
మరోవైపు ఐటీ దాడులపై సోను సూద్ స్పందిస్తూ… తాను చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పారు. ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలను అన్నింటినీ ఇచ్చానని తెలిపారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చానని చెప్పారు. వారి పని వారు చేశారని, తన పని తాను చేశానని అన్నారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు డాక్యుమెంట్లతో సహా వివరాలను అందించానని చెప్పారు. ఇప్పటికీ మరిన్ని డాక్యుమెంట్లను ఇస్తూనే ఉన్నానని… ఇది తన బాధ్యత అని అన్నారు.
తన ఫౌండేషన్ కు దాతలు ఇచ్చిన ప్రతి పైసాకు తానే బాధ్యుడినని సోను చెప్పారు. తాను చట్టాలను ఉల్లంఘించలేదని అన్నారు. గత జులైలో సోను సూద్ ఛారిటీని స్థాపించాడని… మొత్తం రూ. 18 కోట్ల డొనేషన్లు వస్తే… సేవా కార్యక్రమాల కోసం కేవలం రూ. 1.9 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంటూ ఐటీ అధికారులు చేసిన వ్యాఖ్యలపై సోను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నాకు ఆశ్చర్యంగా ఉంది. ఛారిటీలో ఉన్న డబ్బంతా ప్రజల నుంచి డొనేషన్ల రూపంలో మాత్రమే సేకరించింది కాదు. ఎండార్స్ మెంట్ల ద్వారా నేను సంపాదించిన రెమ్యూనరేషన్ కూడా అందులో ఉంది. నేను చదవని మెయిల్స్ 54 వేలు ఉన్నాయి. వేలాది వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ మెసేజ్ లు ఉన్నాయి. రూ. 18 కోట్లు ఖర్చు చేయడానికి నాకు 18 గంటల సమయం కూడా పట్టదు. ప్రతి పైసాను సరైన మార్గంలో, అవసరంలో ఉన్న వ్యక్తికి ఖర్చు చేస్తున్నామా? లేదా? అనేది నిర్ధారించుకోవాలి’ అని సోను అన్నారు.