Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ పాలనపై పవన్ కళ్యాణ్ నిప్పులు… క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమని ప్రకటన!

జగన్ పాలనపై పవన్ కళ్యాణ్ నిప్పులు… క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమని ప్రకటన
-వైసీపీది ఒక దౌర్భాగ్యపు, దాష్టీకపు దిక్కుమాలిన పాలనఅంటూ ధ్వజం
-ఇటీవల ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాల వెల్లడి
-మరోసారి వీడియో సందేశం వెలువరించిన పవన్
-దుర్మార్గాలను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ,జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. వైసీపీది ఒక దౌర్భాగ్యపు, దాష్టీకపు దిక్కుమాలిన పాలనఅంటూ ధ్వజమెత్తారు . జగన్ దుర్మార్గపు పాలనా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమని ప్రకటించారు.

ఇటీవల ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వీడియో సందేశం వెలువరించారు. జనసేన ప్రస్థానం ఒక ఎమ్మెల్యేతో మొదలై నేడు అనేకమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకునే స్థాయికి చేరిందని వెల్లడించారు. 25.2 శాతం ఓట్లను పొందగలిగామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఎన్నికల హింస చోటుచేసుకుంటోందని పవన్ వ్యాఖ్యానించారు.

ఏపీలో వైసీపీది ఒక దౌర్భాగ్యపు, దాష్టీకపు దిక్కుమాలిన పాలన అని అభివర్ణించారు. ఇటువంటి దుర్మార్గపు పాలన భారతదేశంలోనే ఎక్కడా లేదని విమర్శించారు. మంగళగిరిలో నియోజకవర్గంలో తమ అభ్యర్థి జోజిబాబు 65 ఓట్ల ఆధిక్యంతో గెలిస్తే, రీకౌంటింగ్ చేయాలని వైసీపీ అభ్యర్థులు పట్టుబట్టారని, ఆఖరికి వైసీపీ అభ్యర్థి 18 ఓట్లతో గెలుపొందాడని ప్రకటించుకున్నారని తెలిపారు. పోలీసులు, ఓట్ల లెక్కింపు సిబ్బంది కూడా వైసీపీ నేతలకు మద్దతుగా నిలిచారని, గెలిచిన తమ అభ్యర్థిని ఓడిపోయేలా చేశారని ఆరోపించారు.

రైల్వే కోడూరులోనూ తమ అభ్యర్థులకు చెందని ఐదు ఎంపీటీసీ నామినేషన్లను పోలీసులే స్వయంగా తీసేశారని మండిపడ్డారు. వాళ్లు పోలీసుల్లా ప్రవర్తించలేదని, వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని అన్నారు. ఈ దారుణ పాలన పట్ల అందరికీ ఓపికలు నశించిపోయాయని, జనసేన కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు.

151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ రాష్ట్రాన్ని ఎంతో సుభిక్షంగా పాలిస్తుందని ఆశించామని, ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటుందని భావించామని పవన్ తెలిపారు. కానీ ఈ దౌర్భాగ్యపు పాలనను ఇక చూస్తూ ఊరుకునేది లేదని, గట్టిగా ఎదుర్కోవాలని చాలా బలంగా నిర్ణయిచుకున్నామని వెల్లడించారు. అందుకోసం కార్యకర్తలను ఎలా సమాయత్తం చేయాలి, వీళ్ల దాడులను ఎలా ఎదుర్కోవాలి, అవసరమైతే క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధంగా ఉండాలి అనే అంశాలను జనసేన నేతలతో చర్చిస్తామని, విజయవాడలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి నెలా రాష్ట్రంలో జనసేన నేతల పర్యటనలు ఉంటాయని స్పష్టం చేశారు.

Related posts

బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. పార్టీని వీడిన కీలక నేత గంగా ప్రసాద్‌!

Drukpadam

సాగర్ ఎన్నిక కులాల సమరంగా మారుతుందా… ?

Drukpadam

రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల ఎత్తులు …ఖమ్మం లెక్కలు!

Drukpadam

Leave a Comment