Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలుసినిమా వార్తలు

రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ …ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్!

రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ …ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్!
-ప్రభాస్ కండలు పెంచితే, ఎన్టీఆర్ డ్యాన్సులు చేస్తే మాకు డబ్బులొస్తున్నాయి.. మీలాగా దోచుకోవడంలేదు
-చిరంజీవి గారూ… ప్రాధేయపడడం మానుకోండి
-మోహన్ బాబు గారూ… చిత్ర పరిశ్రమను హింసించొద్దని మీ బంధువులకు చెప్పండి
-మోహన్ బాబుకు హితవు పలికిన పవన్ కల్యాణ్
-మీకు బాధ్యత ఉందంటూ వ్యాఖ్యలు
-సినిమా వాళ్లకు ఊరికే డబ్బులు రావు
-కష్టపడి సంపాదిస్తున్నామని వెల్లడి
-అక్రమ కాంట్రాక్టులతో వేలకోట్లు దోచుకోవడంలేదని వ్యాఖ్యలు
-సినీ టికెట్ల వ్యవహారంపై విమర్శనాస్త్రాలు

సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో పవన్ కల్యాణ్ సినిమాలు అడ్డుకుంటే చిత్ర పరిశ్రమ దారికొస్తుందని భావిస్తున్నారని ఆరోపించారు. కానీ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని విమర్శించారు.సినీ పరిశ్రమ జోలికొస్తే తాటతీస్తామని హెచ్చరించారు.

“నటులు, దర్శకులు కోట్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ సినిమా వాళ్లు ఎవరినీ దోచుకుని సంపాదించడంలేదు. తప్పుడు విధానాల్లో దోపిడీలు చేయడంలేదు. మేం డ్యాన్సులు చేసో, కిందపడో, మీదపడో, అవి ఇవీ విరగ్గొట్టుకునో, లేకపోతే బాహుబలిలో ప్రభాస్, రానా గార్ల లాగా కండలు పెంచి ఎంతో కష్టపడితేనే మాకు డబ్బులు వస్తున్నాయి. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా అద్భుతమైన డ్యాన్సులు చేస్తే మాకు డబ్బులు వస్తున్నాయి. మాకు ఒక్క రోజులో డబ్బులు రావడంలేదు… రామ్ చరణ్ వంటి హీరో అద్భుతమైన రీతిలో స్వారీ చేస్తే అప్పుడు వస్తాయి డబ్బులు! అంతేతప్ప అక్రమ కాంట్రాక్టులతో అడ్డగోలుగా సంపాదించడంలేదు.

హీరోయిన్లు ఎక్కడ్నించో వేరే దేశం నుంచో, వేరే రాష్ట్రం నుంచో వచ్చి, ఇక్కడ అందరి ముందు ఇబ్బంది పడుతూ నటించి డబ్బులు తీసుకుంటే ఆమెను ఎందుకు తప్పుబడతారు? అంటూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. దయచేసి ఎవరూ తెగేవరకు లాగొద్దని హితవు పలికారు. దిల్ రాజు వంటి వారికి థియేటర్లు ఉండడం తప్పేముంది? ఒక్కసారి ఎలక్షన్లలో గెలిచి 30 ఏళ్లు అధికారంలో ఉండాలని మీరు కోరుకుంటున్నప్పుడు వ్యాపారాలు చేసుకునేవారికి కోరికలు ఉండవా? అని నిలదీశారు.

ఇటీవల ప్రకాశ్ రాజ్ ను కొందరు అవుట్ సైడర్ అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్, నాన్ లోకల్ అంటూ వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రకాశ్ రాజ్ తనకు ఫ్రెండేమీ కాదని, కానీ ఆయనను నాన్ లోకల్ అనడం బాధించిందని పేర్కొన్నారు. ఓసారి ప్రకాశ్ రాజ్ తనను విమర్శించారని, కానీ అది రాజకీయాల వరకేనని, సినిమాల్లో అందరం కలిసే ఉంటామని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం సినీ టికెట్ల అమ్మకం చేపట్టడాన్ని తప్పు పట్టారు . ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, దాంతో తాము ఇన్ని వ్యాపారాలు చేస్తున్నామని బ్యాంకులకు చూపించి, రుణాలు తీసుకునేందుకే ఏపీ సర్కారు సినిమా టికెట్లు అమ్మేందుకు సిద్ధపడిందని అన్నారు. చిత్రపరిశ్రమ ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు చూపించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

“చిత్ర పరిశ్రమ నుంచి మాకు ఆదాయం వస్తోంది, మటన్ దుకాణాల ద్వారా మాకు ఆదాయం వస్తోంది… ఎలాగూ ఇసుక అమ్మేసుకుంటున్నాం.. అంటూ దానిపై వచ్చే ఆదాయాన్ని కూడా బ్యాంకులకు చూపిస్తారు” అని వివరించారు. ఎక్కడైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ కు వెళితే సరి… మీకో క్వార్టర్ బాటిల్ ఇస్తారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

“ఇలాంటి వాటిపై వచ్చే ఆదాయాన్ని చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. చిత్ర పరిశ్రమను కూడా ఆ విధంగానే ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. మీరు 100 మంది నుంచి ట్యాక్సులు వసూలు చేసి 40 మందికి ధారపోస్తామంటే, మిగతా 60 మంది చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఈ విషయంలో చిత్ర పరిశ్రమ మేల్కొనాలి. దీనిపై నిలదీసే హక్కు మీకుంది. చిరంజీవి గారి లాంటి వ్యక్తులకు కూడా చెప్పండి… ప్రాధేయపడవద్దని చెప్పండి. ఇది మీ హక్కు. ఈ హక్కుతో మాట్లాడండి. ఈ దేశం ఒకడి సొత్తు కాదు. బావా బావా అనో, సోదరా సోదరా అనుకుంటే సరిపోదు, గట్టిగా ప్రశ్నించాలి” అని ఉద్ఘాటించారు.

వైసీపీ వాళ్లు ఏపీలో థియేటర్లు మూసివేస్తున్నప్పుడు మోహన్ బాబు గారు మాట్లాడాలని స్పష్టం చేశారు.”మోహన్ బాబు గారూ… వైఎస్ కుటుంబీకులు మీ బంధువులే కదా… చిత్ర పరిశ్రమను హింసించొద్దని వాళ్లతో చెప్పండి. కావాలంటే పవన్ కల్యాణ్ పై నిషేధం విధించుకోమని చెప్పండి. అతను, మీరు తేల్చుకోండి… కానీ చిత్ర పరిశ్రమ జోలికి రావొద్దని చెప్పండి మోహన్ బాబు గారూ! మీరొక మాజీ పార్లమెంటు సభ్యులు కూడా. మాట్లాడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇవాళ చిత్ర పరిశ్రమకు వర్తింపజేసిన నిబంధనలు రేపు మీ విద్యానికేతన్ విద్యాసంస్థకు కూడా వర్తింపజేసే ప్రమాదం ఉంది” అని స్పష్టం చేశారు.

ఇది తాను మోహన్ బాబు ఒక్కరికే కాకుండా అందరికీ చెబుతున్నానని, లేకపోతే రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేజేతులా చంపేసుకున్నట్టువుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇటు సినీ ఇండస్ట్రీలోనూ , అటు రాజకీయవర్గాలలోను చర్చనీయాంశం అయ్యాయి.

Related posts

కేంద్రం వద్ద మేం అడుక్కుంటున్నామా?… మరి కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీ వెళుతున్నారు?: ఏపీ మంత్రి పేర్ని నాని!

Drukpadam

హెల్మెట్ లేకుండా బైక్ తీస్తే కేసే…హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సీరియస్ వార్నింగ్!

Drukpadam

గీతం యూనివర్సిటీ 40 ఎకరాలు ఆక్రమించుకున్నట్టు రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు​: పంచుమర్తి అనురాధ

Ram Narayana

Leave a Comment