Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ పీక పిసికేశారు.. ప్రజల ఆస్తులు ధ్వంసం చేశారు.. రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!

ఢిల్లీ పీక పిసికేశారు.. ప్రజల ఆస్తులు ధ్వంసం చేశారు.. రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
-భద్రతకూ విఘాతం కలిగిస్తున్నారని మండిపాటు
-ఆందోళనలతో జనం సంతోషంగా ఉన్నారా? అంటూ నిలదీత
-న్యాయవ్యవస్థపైనా ఆందోళనలు చేస్తున్నారా అని ప్రశ్న
-ఇక్కడితో అంతా ఆపేయాలని రైతులకు సూచన

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ రహదారులను దిగ్బంధించారని, ఢిల్లీ పీక పిసికి ఊపిరాడకుండా చేశారని మండిపడింది. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, భద్రతకు విఘాతం కలిగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టులో కిసాన్ మహాపంచాయత్ పిటిషన్ వేసింది. 200 మంది రైతులు అక్కడ దీక్షలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసేందుకు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరింది.

ఇన్నాళ్లూ సరిహద్దుల్లో ఆందోళనలతో ఢిల్లీని ఊపిరాడకుండా చేసిన మీరు.. ఇప్పుడు లోపలికి వస్తామని అడుగుతున్నారా? అంటూ జస్టిస్ ఎ.ఎం. ఖన్వీల్కర్, జస్టిస్ సి.టి. రవికుమార్ ల ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అసలు ఈ ఆందోళనలతో అక్కడి జనాలు సంతోషంగా ఉన్నారా? అంటూ నిలదీసింది. దీన్నంతటినీ ఇక్కడితో ఆపేయాలని సూచించింది.

వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఒక్కసారి సుప్రీంకోర్టుకు వచ్చాక న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాలని సూచించింది. నిజంగా కోర్టులపై విశ్వాసమే ఉంటే ఆందోళనలు చేయడానికి బదులు.. సమస్యపై అత్యవసర విచారణకు డిమాండ్ చేసి ఉండేవారని వ్యాఖ్యానించింది.

‘మీరు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నారా?’ అని అసహనం వ్యక్తం చేసింది. హైవేలన్నీ బ్లాక్ చేసి ప్రశాంతంగా ఆందోళనలు చేస్తున్నామంటే ఎలా? అని ధర్మాసనం నిలదీసింది. ప్రజలూ తమతమ పనులు చేసుకునేందుకు ఎక్కడికైనా వెళ్లే హక్కుంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, తాము హైవేలను బ్లాక్ చేయలేదని, పోలీసులే నిర్బంధించారని పిటిషనర్లు చెప్పారు. దీంతో హైవేలు బ్లాక్ చేసి ఆందోళనలు చేస్తున్న రైతుల గ్రూపులో తాము భాగం కాదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Related posts

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ తప్పదా …?

Drukpadam

జగన్ ను ఓడించాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలి: పవన్ కల్యాణ్

Drukpadam

చట్టాలు, సెక్షన్లు ఇలాంటి సమయంలోనే గుర్తొస్తాయా?: రేణుకా చౌదరి

Drukpadam

Leave a Comment