Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అసెంబ్లీలో బీజేపీ తరుపున ఇక ‘ఆర్ఆర్ఆర్’! బండి సంజయ్!

అసెంబ్లీలో బీజేపీ తరుపున ఇక ‘ఆర్ఆర్ఆర్’! బండి సంజయ్!
-రాజా సింగ్ , రఘునందన్ , రాజేందర్
-ఈటలపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ ప్రజాగళం:
-హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయం
-కేసీఆర్ పాలించే అర్హత కోల్పోయారు.. ఈటల సవాల్ మరోవైపు,
-డబ్బు, లిక్కర్ లేకుండా గెలిచే దమ్ముందా కేసీఆర్?

హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపు ద్వారా అసెంబ్లీ లో త్రీబుల్ ఆర్ గా బీజేపీ వాయిస్ మారుతుందని బండి సంజయ్ అన్నారు. త్రీబుల్ ఆర్ అంటే రాజా సింగ్ ,రఘునందన్ , రాజేందర్ అని వివరం ఇచ్చారు. ఈటల గెలుపు ను ఎవరు అడ్డుకోలేరని అన్నారు

హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు . ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో బండి సంజయ్ పిలుపు నిచ్చారు . ఈటల రాజేందర్ ఉద్యమ స్ఫూర్తిని హుజూరాబాద్‌లో నింపారని, ఇక్కడి ప్రజలు చైతన్యం కలిగినవారని అన్నారు సంజయ్.

హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరెన్సీని గెలిపిస్తారా? బీజేపీ కాషాయం జెండాను గేలిపిస్తారా? అని ప్రశ్నించారు బండి సంజయ్. ఈటల రాజేందర్ ఉద్యమ కారుడు, మంచి నాయకుడని కొనియాడారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్న నేత అని అన్నారు. ఈటల కల్మషం లేని బోలామనిషని, రాజేందర్‌కు వాడుకుని అన్యాయం చేసినవారికి పాపం తగులుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని, దొంగ దీక్షేనని ఎద్దేవా చేశారు బండి సంజయ్. హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే కేసీఆర్‌ పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా ఈటల రాజేందర్ గెలుపును ఆపలేరని అన్నారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈటల రాజేందర్ విజయం సాధించడం ఖాయమని అన్నారు. నకిలీ ఉత్తరాలు సృష్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్‌పై బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ కుతంత్రాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. హుజూరాబాద్‌లో రాజేందర్ గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ ప్రజాగళం వినిపిస్తారని బండి సంజయ్ చెప్పారు. రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్‌లు ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడుతారని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో రఘునందన్ రావు, రాజాసింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

టీఆర్ఎస్ పంచే డబ్బులు తీసుకుని ఓట్లు మాత్రం బీజేపీకి వేయాలని ప్రజలకు సూచించారు. కాగా, అంతకు ముందు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పలువురు బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మొదటి విడత పాదయాత్ర సక్సెస్ అయిందన్నారు. ఆగస్టు 28న హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టారు బండి సంజయ్. 36 రోజుల పాటు.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యాత్ర కొనసాగింది. 8 జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నడిచారు. శనివారం హుస్నాబాద్ లో తొలివిడత ప్రజాసంగ్రామ యాత్ర ముగిసింది.

తెలంగాణను పాలించే నైతిక హక్కును కేసీఆర్ ఎప్పుడో కోల్పోయారని ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్‌‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని.. లేదంటే కేసీఆర్ రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

హుజురాబాద్‌లో నన్ను ఓడించేందుకు ఆరుగురు మంత్రులు, పదుల కొద్దీ ఎమ్మెల్యేలు ఐదు నెలలుగా కుట్రలు పన్నుతున్నారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి నన్ను ఓడించి.. మరో 20 ఏళ్లు తెలంగాణను బానిసత్వంలో ముంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. లేవలేనోడు, చేతగానోడు నా మీద ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. నేను ధీరుడిలా పోరాడి గెలుస్తా. కేసీఆర్.. నీకు దమ్ముంటే లిక్కర్, డబ్బులు పంచకుండా గెలువు. నీ పార్టీకి ఇక్కడ డిపాజిట్ కూడా రాదు. అక్టోబర్ 30న టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలె అంటూ ఈటల రాజేందర్ ప్రజలను కోరారు.

 

 

Related posts

విజయమ్మ భావోద్యోగ ప్రసంగం …షర్మిలకు అండగా వైసీపీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి !

Drukpadam

జూపల్లి ఇంట్లో ఇంకా వైఎస్ఆర్ ఫొటో ఉంది.. కేసీఆర్ ఫొటో ఎందుకు లేదని అడిగా: మంత్రి సింగిరెడ్డి…

Drukpadam

ప్రగతి భవన్.. కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయమా?: రేవంత్ రెడ్డి!

Drukpadam

Leave a Comment