బ్యాలెట్ పేపర్లను నేను ఇంటికి తీసుకెళ్లలేదు: ‘మా’ ఎన్నికల అధికారి వివరణ
-ప్రభాకర్ ఆరోపణల్లో నిజం లేదు
-బ్యాలెట్ బాక్సుల తాళాలను మాత్రమే ఇంటికి తీసుకెళ్లాను
-అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదు
-ప్రకాశ్ రాజ్ రాజీనామా ఆయన వ్యక్తిగతం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో రేగిన మంటలు ఇంకా చల్లారలేదు ….పరస్పర ఆరోపణలతో సినిమా చూపిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మూకుమ్మడి రాజీనామా సందర్భంగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ పైకూడా ఆరోపణలు చేశారు.ప్రత్యేకించి బుల్లితెర ఆర్టిస్ట్ ప్రభాకర్ ఎన్నికల అధికారి లెక్కించకుండా ఉన్న బ్యాలట్ పాత్రలను తనవెంట తీసుకోని వెళ్లాడని ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని ఆరోపించారు. రెండవరోజు కూడా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల అధికారిని బ్యాలట్ పేపర్లు వెంట ఇంటికి తీసుకోని పోవడం గురించే అడిగానని ఆయన నుంచి తనకు సమాధానం లేదని అన్నారు దానిపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ స్పందించారు. ప్రభాకర్ ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. తాను వెంట తీసుకోని పోయింది బ్యాలట్ పేపర్లు కాదని బ్యాలట్ బాక్స్ ల తాళాలు మాత్రమేనని వివరణ ఇచ్చారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్స్ సభ్యులు తమ నోటికి పని కల్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్తభరితంగా జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించింది.
మరోవైపు ఎన్నికల నిర్వహణపై ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల అధికారి బ్యాలట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారని నటుడు ప్రభాకర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు తొలిరోజు గెలిచిన వారు రెండో రోజు ఎలా ఓడిపోయారంటూ అనసూయ తన ఓటమి గురించి అనుమానాలను లేవనెత్తింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారికంగా ప్రకటించక ముందే అనసూయ గెలిచినట్టు బయట వార్తలు వచ్చాయని చెప్పారు. తాను బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లాననే వార్తల్లో నిజం లేదని అన్నారు. బ్యాలెట్ పేపర్లను ఉంచిన బాక్సుల తాళాలను మాత్రమే తాను తీసుకెళ్లానని స్పష్టం చేశారు. అసోసియేషన్ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు.