Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఫైనల్ ముందర సెకండ్ ప్లే ఆఫ్ లో బోల్తా పడ్డ ఢిల్లీ!

ఫైనల్ ముందర సెకండ్ ప్లే ఆఫ్ లో బోల్తా పడ్డ ఢిల్లీ!
సిక్సర్ కొట్టి ఢిల్లీ కొంప ముంచిన త్రిపాఠి.. ఫైనల్‌కు కోల్‌కతా
చివరి వరకు దోబూచులాడిన విజయం
లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతాదే విజయం
చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ
మూడోసారి ఫైనల్‌కు కోల్‌కతా

విజయాలను అలవాటుగా చేసుకుని తొలి నుంచి ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వచ్చిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు చివరి మెట్టుపై బోల్తాపడింది. గత రాత్రి షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఓడి నిరాశగా ఇంటిముఖం పట్టింది. ఈసారి ఐపీఎల్‌లో కొత్త చాంపియన్‌గా అవతరిస్తుందన్న అభిమానుల అంచనాలను తలకిందులు చేసింది.

ఢిల్లీ నిర్దేశించిన 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా ఒక్క బంతి మిగిలి ఉండగా ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి బంతి వరకు టెన్షన్‌గా మారిన ఈ మ్యాచ్‌ పలు మలుపులు తిరిగింది. చివర్లో కోల్‌కతా 25 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. దీంతో కోల్‌కతా విజయం ఖాయమని అందరూ భావించారు.

కానీ, అప్పుడే మ్యాచ్ మలుపు తిరిగింది. నితీశ్ రాణా (13) అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో రెండు పరుగులే రావడంతో విజయం దోబూచులాడడం మొదలుపెట్టింది. ఆ తర్వాతి ఓవర్లో ఒక్క పరుగే రాగా, దినేశ్ కార్తీక్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఈసారి మోర్గాన్ డకౌట్ అయ్యాడు. ప్రేక్షకుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు, ఓటమి అంచున నిలిచిన ఢిల్లీలో నూతనోత్సాహం కనిపించింది.

చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 7 పరుగులు అవసరం కాగా, తొలి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే వచ్చింది. వరుస బంతుల్లో షకీబల్ హసన్, సునీల్ నరైన్ డకౌట్ అయి పెవిలియన్ చేరారు. రెండు జట్ల అభిమానుల్లో టెన్షన్ మరింత పెరిగింది. కోల్‌కతా చేతుల్లోంచి ఢిల్లీ విజయాన్ని లాగేసుకున్నట్టు కనిపించింది.

అయితే, అయిదో బంతికి సీన్ రివర్స్ అయింది. అశ్విన్ వేసిన ఐదో బంతిని త్రిపాఠి లాంగాఫ్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపాడు. అంతే.. ఢిల్లీ నిరాశలో కూరుకుపోతే కోల్‌కతా సంబరాల్లో మునిగిపోయింది. ఢిల్లీ ఓడినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. కోల్‌కతా బ్యాటర్లలో శుభమన్ గిల్ 46, వెంకటేశ్ అయ్యర్ 55 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిక్ నార్జ్, అశ్విన్, రబడ చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్‌ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పృథ్వీషా 18, ధావన్ 36, స్టోయిన్స్ 18, శ్రేయాస్ అయ్యర్ 30, హెట్మెయిర్ 17 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకోగా, ఫెర్గ్యూసన్, శివమ్ మావి చెరో వికెట్ తీసుకున్నారు. వెంకటేశ్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

కాగా, ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై-కోల్‌కతా పోటీపడనుండడం ఇది రెండోసారి. 2012లో చెన్నైని ఓడించి కోల్‌కతా విజేతగా నిలిచింది. కేకేఆర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. ఇక, ఈ సీజన్‌లో కేకేఆర్ ఇప్పటి వరకు 2 మ్యాచుల్లోనే ఓడింది. కోల్‌కతా-చెన్నై మధ్య రేపు (15న) దుబాయ్‌లో తుదిపోరు జరగనుంది.

Related posts

ఐపీల్ ఆటగాళ్ల పై బీసీసీఐ కీలక ప్రకటన … ఇబ్బందులు ఉంటె వెళ్లవచ్చు

Drukpadam

టీం ఇండియా లో విభేదాలు అంటూ పాకిస్తాన్ దుష్ప్రచారం ….

Drukpadam

టీమిండియా-బంగ్లాదేశ్ మొదటి టెస్టు… ముగిసిన తొలి రోజు ఆట!

Drukpadam

Leave a Comment