మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లో క్రియాశీలంగా వ్యవహరించనున్న బండ్ల గణేష్!
ఇక రేవంత్ చెప్పడమే తరువాయి అంటున్న బండ్ల గణేశ్
పార్టీలో మళ్లీ క్రియాశీలం కావాలని కోరిన మల్లు రవి
సానుకూలంగా స్పందించిన బండ్ల గణేశ్
షాద్‌నగర్ నుంచి 500 మంది యువతకు సినీ పరిశ్రమలో అవకాశం కల్పిస్తానన్న బండ్ల
టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి క్రియాశీలం కానున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన తిరిగి పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం పరిధిలోని బుచ్చిగూడ మాజీ సర్పంచ్ తాండ్ర సులోచనమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి, మల్లు రవి, బండ్ల గణేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో పార్టీలో మళ్లీ క్రియాశీలం కావాలని బండ్ల గణేశ్‌ను మల్లు రవి కోరారు. దీనికి నిర్మాత సానుకూలంగా స్పందించారు. రేవంత్ అన్న ఆదేశిస్తే అడుగు ముందుకు వేస్తానని చెప్పారు.
జర్నలిస్ట్ ఖాజాపాషా నటించిన గోలీమార్ పాటను గణేశ్ నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ పట్ల ఆసక్తి కలిగిన కనీసం 500 మంది షాద్‌నగర్ యువకులకు అవకాశం కల్పించడమే తన లక్ష్యమన్నారు. చిరంజీవి సినిమాలను ఆదర్శంగా తీసుకుని తాను సినీ పరిశ్రమకు వచ్చినట్టు చెప్పారు. పట్టుదల ఉంటే సినీ పరిశ్రమలో బోల్డన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.