కేసీఆర్ కుర్చీ లాగుకునేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు:ఎంపీ అరవింద్
-తెలంగాణాలో కేటీఆర్ , ఏపీ లో లోకేష్ భవిషత్ నేతలు అయ్యేలా ఆపరేషన్
-‘ఆపరేషన్ హైద్రావతి’ అందులో భాగంగానే రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడయ్యారు
-చంద్రబాబు, రాహుల్ గాంధీ, కేటీఆర్ లు స్టాలిన్ తో కలిసి ఆపరేషన్ చేపట్టారు
-ఏపీలో లోకేశ్, టీఎస్ లో కేటీఆర్ భవిష్యత్తు నేతలు అయ్యేలా వ్యూహరచన జరిగింది
-హుజూరాబాద్ ఉపఎన్నికే కేసీఆర్ నాయకత్వంలో జరిగే చివరి ఎన్నిక
భవిషత్ లో రాజకీయ సమీకరణాలు అతివేగంగా మారబోతున్నాయని ఏపీ లో లోకేష్ , తెలంగాణాలో కేటీఆర్ లు నేతలు అయ్యేలా ఆపరేషన్ జరుగుతుందని దీనిపేరు హైద్రావతి అని బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ తో కలిసి ఒక ఆపరేషన్ చేపట్టారని… దాని పేరు ‘ఆపరేషన్ హైద్రావతి’ అని చెప్పారు. ఏపీలో నారా లోకేశ్, తెలంగాణలో కేటీఆర్ భవిష్యత్తు నేతలు అయ్యేలా వ్యూహరచన జరిగిందని అన్నారు. ఆపరేషన్ హైద్రావతిలో భాగంగానే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగే చివరి ఎన్నిక హుజూరాబాద్ ఉపఎన్నికేనని చెప్పారు. ఆ తర్వాత పార్టీ కేటీఆర్ చేతుల్లోకి వెళ్లిపోతుందని… ఆ తర్వాత టీఆర్ఎస్ ను కేటీఆర్ విచ్ఛిన్నం చేస్తారని ఆయన జోస్యం చెప్పారు. అయితే కేసీఆర్ ఆయన జాగ్రత్తల్లో ఆయన ఉన్నారని అరవింద్ చెప్పారు. తానే కాబోయే సీఎం అని ఇప్పటికే కేటీఆర్ కీలక నేతలతో ప్రచారం చేయించుకున్నారని… అయితే కేసీఆర్ మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారని తెలిపారు.
కేసీఆర్ కుర్చీని లాగేసేందుకు గజనీ మొహ్మద్ లా కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయితే కేసీఆర్ చాలా అప్రమత్తంగా ఉన్నారని.. అందుకే ప్లీనరీ ప్రచార పోస్టర్లలో కేటీఆర్ ఫొటో లేకుండా చూసుకున్నారని చెప్పారు. టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలలో 80 శాతం మంది వలసదారులేనని అన్నారు.