నిన్న, మొన్న వచ్చినవారికి మంత్రి పదవులు వచ్చాయి.. నాకు రాలేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి…మంత్రి పదవి ఇవ్వకపోయినా బాధపడటం లేదు… కేసీఆర్ కు నమ్మకంగా పని చేస్తున్నాను… పార్టీ శ్రేణులు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు
జనగామకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలోకి నిన్న, మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయని… పార్టీలో సీనియర్ గా ఉన్న తనకు ఇంత వరకు మంత్రి పదవి రాలేదని ఆయన వాపోయారు. అయినా తాను బాధపడటం లేదని… పార్టీ అధినేత కేసీఆర్ కు, పార్టీకి విధేయుడిగా ఉంటూ, పార్టీ ఉన్నతి కోసం నమ్మకంగా పని చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ వల్లే తాను ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు, నేతలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారని ముత్తిరెడ్డి అన్నారు. ఇకనుంచి తనకు పార్టీ శ్రేణులు చెప్పిందే వేదమని… వారు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు అందుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పారు. జనగామలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు కు మంత్రి పదవి ఇవ్వడంపై కొంతమంది సీనియర్లలో అసంతృప్తి ఉందనేది ఆయన మాటలను బట్టి అర్థం అవుతున్నది. ఆయనే 2014 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్ యస్ లో చేరారు. తిరిగి 2018 ఎన్నికలలో టీఆర్ యస్ అభ్యర్థిగానే పోటీచేసి గెలిచారు.ఉద్యమ సమయంలో ఆయన తెలుగుదేశంలోనే ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి వచ్చి తమకు రాలేదనే భాద ఉద్యమకారుల్లో ఉంది. దీనిపై అసంతృప్తి ఉన్న కొందరు బయటికి చెప్పలేక పోతున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి.