ఒడిశా పర్యటనకు వెళుతున్న సీఎం జగన్
జలవివాదాలే ప్రధాన ఎజెండా
ఈ నెల 9న భువనేశ్వర్ లో పర్యటించనున్న జగన్
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న సీఎం
జల వివాదాలపై చర్చించనున్న ఇరువురు ముఖ్యమంత్రులు
ఏపీ సీఎం జగన్ పొరుగు రాష్ట్రాలతో జలవివాదాలు పరిష్కరించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగా తొలుత ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. అందుకోసం ఆయన ఒడిశా పర్యటనకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు . ఆయన వెంట పలువురు అధికారులు కూడా పాల్గొంటారని తెలుస్తుంది. తెలంగాణ తో కూడా జలవివాదాలు జటిలంగా ఉన్నాయి.అయితే ఇద్దరు ముఖ్యమంత్రులమధ్య సాధారణ సంబంధాలు ఉన్నందున వారు కూర్చొని మాట్లాడుకుంటే పరిస్కారం చేసుకోవచ్చునని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒడిశా సీఎం తో భేటీ అనంతరం రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలతో పాటు సరిహద్దు వివాదాల సమస్య కూడా ప్రస్తావనకు రావచ్చునని అంటున్నారు. ఏదైనా ఇది ఒక ముందడుగు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ ఒడిశా పర్యటనకు ఈ నెల 9న వెళ్లనున్నారు. ఆయన ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల జల వివాదాల గురించి ఈ సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
ఇరు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో వివాదం నడుస్తోంది. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి గతంలోనే నవీన్ పట్నాయక్ కు జగన్ లేఖ రాశారు. ఈ బ్యారేజ్ నిర్మాణంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలు కలుగుతుందని లేఖలో జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని చెప్పారు. తన ఒడిశా పర్యటనలో నవీన్ పట్నాయక్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను కూడా జగన్ కలవనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గ్రామాల సమస్య కూడా ఉంది. దానిపై కూడా ఇరువురు సీఎం లు చర్చించుకునే అవకాశాలు ఉన్నాయి.