మలాలాను పెళ్లాడిన అస్సర్ మాలిక్ !
- చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న మలాలా, అస్సర్
- పాక్ క్రికెట్ బోర్డు హై పర్ఫామెన్స్ జనరల్ మేనేజర్ గా ఉన్న అస్సర్
- 2019 జూన్ లో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నట్టు సమాచారం
నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న 24 ఏళ్ల మలాలా యూసుఫ్ జాయ్ తాను పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అస్సర్ మాలిక్ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడింది. అయితే అస్సర్ ఎవరు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అస్సర్ కూడా మలాలా మాతృభూమి పాకిస్థాన్ కు చెందిన వ్యక్తే. చాలా కాలంగా మలాలా, అస్సర్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. చివరకు వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.
వాస్తవానికి వివాహబంధంపై మలాలాకు పెద్దగా నమ్మకం లేదు. ఇదే విషయాన్ని ఆమె ఎన్నో ఇంటర్వ్యూలలో తెలిపింది. అయితే అస్సర్ పరిచయం అయిన తర్వాత ఆమె మనసు మారింది. ఆయన ప్రేమలో పడిపోయి, చివరకు ఆయనను పెళ్లాడింది. మలాలా ప్రేమించి పెళ్లాడిన అస్సర్ ఎవరో కాదు… పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హై పర్ఫామెన్స్ జనరల్ మేనేజర్.
2020లో పాక్ క్రికెట్ బోర్డులో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన లింకెడిన్ ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లలోని ఎన్నో ఫొటోల ద్వారా ఈ విషయం తెలుస్తోంది. పీసీబీలో భాగస్వామి కాకముందు నుంచే ఆయన పాకిస్థాన్ అమెచ్యూర్ క్రికెట్ లీగ్ లో కీలక పాత్ర పోషించారు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో కథనం ప్రకారం… అమెచ్యూర్ లీగ్ కు సంబంధించి లాస్ట్ మ్యాన్ స్టాండ్ ఫ్రాంఛైజీకి ఆయన యజమాని.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫ్రాంఛైజీ ముల్తాన్ సుల్తాన్స్ కు అస్సర్ ఆపరేషనల్ మేనేజర్ గా వ్యవహరించారు. లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ నుంచి 2012లో ఆయన ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అంతేకాదు… కళలతో కూడా ఆయనకు పరిచయం ఉంది. డ్రామాలైన్ అనే థియేటర్ ప్రొడక్షన్స్ కు ఆయన ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు.
అయితే, మలాలా, అస్సర్ ఎప్పుడు తొలిసారి కలుసుకున్నారనే విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. 2019 జూన్ లో వీరిద్దరూ తొలిసారి కలిసి ఉండొచ్చని భావిస్తున్నారు.