సొంత శాటిలైట్‌ను పేల్చివేసిన రష్యా.. అమెరికా తీవ్ర ఆగ్రహం!
- శాటిలైట్లను పేల్చివేసే క్షిపణిని తయారు చేసిన రష్యా
- ఏమాత్రం గురితప్పకుండా శాటిలైట్ ను పేల్చి వేసిన వైనం
- దీని వల్ల వేలాది శిథిలాలు ఉత్పన్నమయ్యాయంటూ అమెరికా ఆగ్రహం
రష్యాపై మరో అగ్రదేశం అమెరికా ఇప్పుడు మండిపడుతోంది. దానికి కారణం, అంతరిక్షంలోని ఓ శాటిలైట్ ను రష్యా పేల్చివేయడమే. రష్యా తాజాగా యాంటీ శాటిలైట్ క్షిపణిని తయారు చేసింది. దీనిని పరీక్షించడం కోసం అనరిక్షంలోని తన సొంత శాటిలైట్ ను ఏమాత్రం గురితప్పకుండా పేల్చివేసింది.
అయితే, దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యంగా ఉపగ్రహాన్ని పేల్చి వేసిందని వ్యాఖ్యానించింది. శాటిలైట్ ను పేల్చివేయడం ద్వారా దాని శకలాలు అంతరిక్షంలో పెద్ద ఎత్తున ఉత్పన్నమయ్యాయని తెలిపింది. సుమారు 1500 పెద్ద శకలాలు ఉత్పన్నమయ్యాయని, వేల సంఖ్యలో చిన్న పరిమాణంలో శిథిలాలు ఉన్నాయని చెప్పింది. ఈ పరీక్ష వల్ల అన్ని దేశాలకు సమస్య వచ్చిందని… స్పేస్ స్టేషన్ కు కూడా ముప్పు ఉందని విమర్శించింది.
ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారని… వారిలో నలుగురు అమెరికన్లు, ఇద్దరు రష్యన్లు, ఒక జర్మన్ ఉన్నారని తెలిపింది. ఇలాంటి చర్యల వల్ల వ్యోమగాములకు తీవ్రమైన ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అసహనం వ్యక్తం చేసింది.