Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మహా ధర్నాలో కేసీఆర్.. యుద్ధం ప్రారంభమైందన్న సీఎం!

మహా ధర్నాలో కేసీఆర్.. యుద్ధం ప్రారంభమైందన్న సీఎం!
-రైతుల పట్ల కేంద్రం వ్యతిరేకతతో ఉందన్న కేసీఆర్
-వరి కొనాలని మోదీని కోరినా స్పందన లేదని మండిపాటు
-కేంద్రం దిగొచ్చేంత వరకు పోరాడతామని వ్యాఖ్య

రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఇక యుద్ధం ఆగబోదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతుల పట్ల కేంద్రం పూర్తి వ్యతిరేకతతో ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగానే తాము యుద్ధాన్ని ప్రారంభించామని… ఇది కేవలం ఆరంభం మాత్రమేనని… రాబోయే రోజుల్లో యుద్ధాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

పంజాబ్ లో కొన్న విధంగానే తెలంగాణలో కూడా వరి ధాన్యాన్ని కొనాలని ప్రధాని మోదీని స్వయంగా కోరానని… అయినా మోదీ నుంచి ఉలుకు, పలుకు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. గ్రామాలలో సైతం ధర్నాలు చేయాలని రైతులకు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచి మన డిమాండ్లను సాధించుకుందామని చెప్పారు.

దేశం కోసం కూడా పోరాడుతాం.. గోల్ మాల్ గాళ్లకు గోరీ కట్టాలి

 

  • దేశ వ్యాప్తంగా రైతుల సమస్యల మీద టీఆర్ఎస్ పార్టీ లీడ్ తీసుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని మొదలు పెట్టామని… ఇకపై దేశం కోసం కూడా పోరాడతామని అన్నారు. దేశంలో జెండా ఎగరాల్సిందేనని… దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని లేపాల్సిందేనని చెప్పారు. గోల్ మాల్ గాళ్లకు గోరీ కట్టాల్సిందేనని అన్నారు. యాసంగిలో వరి వేయాలా? వద్దా? అనే విషయాన్ని కేంద్రం చెప్పాలని… అప్పుడు మా చావేదో మేము చస్తామని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వ సమాధానం కోసం రెండు, మూడు రోజులు వేచి చూస్తామని… ఆ తర్వాత ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. తాము కేసులకు భయపడే రకం కాదని అన్నారు. యుద్ధం చేయడంలో టీఆర్ఎస్ ను మించిన పార్టీ లేదని చెప్పారు. కేంద్రం దిగిరాకపోతే ప్రతి గ్రామంలో బీజేపీకి చావు డప్పు కొడతామని అన్నారు.దేశానికి విద్యుత్ ఇచ్చే తెలివి లేదు కానీ… మోటార్లకు మీటర్లు పెట్టాలంట అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఒక దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు నిరంకుశ చట్టాలని అన్నారు. రైతులను కేంద్రం బతకనిచ్చేలా లేదని విమర్శించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల కన్నా ఇండియా దీన స్థితిలో ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు.

 

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు చేసింది: మంత్రి నిరంజన్ రెడ్డి
వరి ధాన్యం కొనకపోతే కేంద్రానికే నష్టం
ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలి
ఐకమత్యంతో రైతులదే విజయమన్న మంత్రి

 

రైతుల ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ ధర్నాలో కూర్చున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద టీఆర్ఎస్ జరుపుతున్న ఆందోళనలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అద్భుతాలు జరిగాయని, పల్లెలన్నీ పచ్చబడ్డాయని అన్నారు. రాష్ట్రంలోని అద్భుత ప్రాజెక్టులతో బీడు భూముల్లోనూ పంటలు పండుతున్నాయన్నారు. రైతుబంధు వంటి పథకాలతో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో అన్ని సీజన్లలోనూ వరి పండుతుందని చెప్పిన ఆయన.. ఈ వానాకాలంలో 63 లక్షల ఎకరాల్లో వరి వేశారన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ అస్పష్ట విధానాలతో రైతులకు నష్టం కలుగుతోందని మండిపడ్డారు. కేంద్రం ఒప్పందం చేసుకున్న ధాన్యాన్నీ కొనట్లేదని విమర్శించారు. కేంద్రం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని, లేదంటే నష్టపోక తప్పదని హెచ్చరించారు. రైతులు ఐకమత్యంగా ఉంటే అంతిమ విజయం రైతులదేనన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని ఆయన విమర్శించారు.

Related posts

వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం…

Drukpadam

రెవెన్యూ అధికారుల తీరుతో మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాలనిపిస్తోంది: మాజీ మావోయిస్టు శ్రీనివాసులు!

Drukpadam

లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేస్తున్న కుమార్తె…

Drukpadam

Leave a Comment