- పార్లమెంట్ లో విధిగా ప్రకటించాకే నిర్ణయమన్న తికాయత్
- ఇతర సమస్యలపైనా చర్చించాల్సిందేనని డిమాండ్
- ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న ఎస్కేఎం
- మద్దతు ధర చాలా ముఖ్యమైన డిమాండ్ అని కామెంట్
కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేసినా రైతులు మాత్రం ఢిల్లీ సరిహద్దులను వీడివెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు తమ ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో చట్టాలను విధిగా రద్దు చేసిన తర్వాతే.. ఆందోళన విరమింపు, సరిహద్దుల నుంచి కదిలే విషయం మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతులకున్న ఇతర సమస్యలపైనా చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు.
కాగా, ఆందోళనల విరమణ, తదుపరి కార్యాచరణకు సంబంధించి రేపు రైతు సంఘాల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు.. కనీస మద్దతు ధర పెంపుపైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ డిమాండ్ ఇంకా పెండింగ్ లోనే ఉందని, దానిపై ఏదో ఒకటి తేల్చాలని తేల్చి చెప్పారు.
ఇప్పటికే సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటన చేసిన తర్వాత.. సింఘూ సరిహద్దుల్లో ఉన్న రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. మూడు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఏడాదికిపైగా రైతులు అక్కడే ఉండి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.