హైకోర్టు నుంచి తప్పించుకోవడానికే…. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనపై పవన్ కల్యాణ్ విమర్శలు
- మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ ప్రకటన
- బిల్లుల ఉపసంహరణ
- హైకోర్టులో 54 కేసులు ఉన్నాయన్న పవన్
- ఓటమి తప్పదని వైసీపీ ప్రభుత్వం గ్రహించిందని వెల్లడి
ఏపీకి మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు ఉపసంహరణపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. హైకోర్టులో ఓటమి తప్పదని భావించే హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అమరావతికి సంబంధించి 54 కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోందని, న్యాయస్థానం నుంచి తాత్కాలికంగా తప్పించుకునేందుకు బిల్లుల రద్దుకు ఉపక్రమించారని విమర్శించారు.
కోర్టు తీర్పుతో ఈ అనిశ్చితికి తెరపడుతుందని భావిస్తే, సీఎం జగన్ ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరదీసిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మూడు రాజధానులపై మరింత స్పష్టతతో కొత్త బిల్లు తెస్తామని ప్రకటించడం ద్వారా ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని మండిపడ్డారు. అమరావతిపై రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఒకే రాజధాని చాలని ఏకతాటిపై నిలిస్తే, ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోందని విమర్శించారు.
వైసీపీ సర్కారు తాత్కాలిక ప్రయోజనం కోసం కాకుండా దూరదృష్టితో ఆలోచించాలని, ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధాని ఆవిర్భావానికి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.