- నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వరద బీభత్సం
- వరద ప్రాంతాల్లో చంద్రబాబు, నాదెండ్ల పర్యటనలు
- సీఎం జగన్ పై విమర్శల దాడి
- అసెంబ్లీలో సీఎం జగన్ వివరణ
- ఈ సమయంలో సహాయక చర్యలే ముఖ్యమని ఉద్ఘాటన
కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా నష్టపరిచాయి. అయితే, సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శించకపోవడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఎందుకు వరద ముంపు ప్రాంతాలకు వెళ్లలేదో సీఎం జగన్ అసెంబ్లీలో నేడు వివరించారు.
“వరద కారణంగా పలు జిల్లాలు దెబ్బతినడంతో నాకు కూడా అక్కడికి వెళ్లాలనిపించింది. ఇదే మాట అధికారులతో చెప్పాను. చంద్రబాబు ఇప్పటికే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు కదా… ఇక నాపై బురద చల్లి, బండలు వేస్తారు అని కూడా చెప్పాను. అయితే నేను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళితే ఏం జరుగుతుందో సీనియర్ అధికారులు కళ్లకు కట్టినట్టు చెప్పారు.
ఇప్పుడు సహాయక, పునరావాస చర్యలే ముఖ్యమని వాళ్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగాలన్నీ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని, సీఎం వస్తున్నాడంటే ఆ పనులన్నీ వదిలేసి సీఎం పర్యటన ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉంటుందని విడమర్చి చెప్పారు. ఇప్పటికే పునరావాస కార్యక్రమాలను మంత్రులు, ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారని, ఈ సమయంలో ముఖ్యమంత్రి అక్కడికి వెళితే వారు వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేస్తారని వివరించారు.
మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా అంతా సీఎం చుట్టూ ఉంటుందని, అప్పుడు వరద బాధితులను పట్టించుకునేవాళ్లే ఉండరని ఆ సీనియర్ అధికారులు చెప్పారు. ఇది నిజమే అనిపించింది. అందుకే వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లలేదు” అని వివరణ ఇచ్చారు.