వడ్లు కొనుగోళ్లపై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తాం …టీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామా!
-రాష్ట్రాలకు రావాల్సిన వాటాలు ,జలవివాదాలు పై పట్టుబడతాం
-పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై మా ఎంపీ లకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు
-తెలంగాణ ప్రయోజనాలపై రాజీ పడొద్దని కేసీఆర్ స్పష్టీకరణ
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని టీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు వెల్లడించారు. రేపటినుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నామా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని తప్పు బట్టారు . ఇదే విషయాన్నీ అఖిలపక్ష సమావేశంలో సైతం వెల్లడించామని పేర్కొన్నారు. యాసంగి కొనుగోలు చేయరు . వానాకాలం వడ్లు ఎన్ని కొంటారో చెప్పారు . రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాల్సిన భాధ్యతనుంచి కేంద్రం తప్పుకోవడం అత్యంత దుర్మార్గం అని నామా మండి పడ్డారు . ఇదే విషయాన్నీ మా ముఖ్యమంత్రి పార్లమెంట్ సభ్యుల సమావేశంలో మాకు దిశానిర్దేశం చేశారని అన్నారు. నది జలాల విషయంలో తెలంగాణ వాటా పై కూడా కేంద్రవైఖరి సరిగా లేదని అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు , ప్రయేకించి తెలంగాణ విషయంలో జరుగుతున్న అన్యాయాలపై కేసీఆర్ సూచనలకు అనుగుణంగా పార్లమెట్ లో తమ వాణి ని వినిపిస్తామని తెలిపారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఉదయం ప్రగతి భవన్ లో పార్టీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల అంశంలో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదన్న విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ఓపికపట్టామని, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలని నిర్దేశించారు. బాయిల్డ్ రైస్ పై కేంద్రం వైఖరిపై నిలదీయాలని స్పష్టం చేశారు.