ఏపీ కంటే తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యం సేకరించాం: పార్లమెంటులో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ వివరణ…
- లోక్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం
- ధాన్యం సేకరణపై ప్రశ్నించిన టీఆర్ఎస్ ఎంపీలు
- లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి
- తెలంగాణ ఖరీఫ్ సీజన్ టార్గెట్ ఇప్పటికే నిర్ణయమైపోయిందని వెల్లడి
కేంద్ర సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లోక్ సభలో నేడు ధాన్యం సేకరణ అంశంపై వివరణ ఇచ్చారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ…. 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని వెల్లడించారు. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని తెలిపారు.
2018-19లో ఏపీ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని మంత్రి వివరించారు. ఏపీ కంటే తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరించామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నకు ఆమె ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
2020-21 ఖరీఫ్ సీజన్ లో 521.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఖరీఫ్ లో తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని స్పష్టం చేశారు. యాసంగికి సంబంధించి సీజన్ మొదలయ్యాకే ఎంత సేకరించాలన్న టార్గెట్ నిర్ణయిస్తామని తెలిపారు.