Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 14న ‘విభజన భయానక జ్ఞాపక దినం’ గా జరుపుకోవాలి: ఎర్రకోటపై నుంచి మోదీ!

ఆగస్టు 14న ‘విభజన భయానక జ్ఞాపక దినం’ గా జరుపుకోవాలి: ఎర్రకోటపై నుంచి మోదీ
-ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం
-జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ
-వీర జవాన్లకు ప్రణామాలు
-టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు అందించిన క్రీడాకారులపై ప్రశంసలు
-కొవిడ్‌తో దేశ ప్రజలు సహనంతో పోరాడారు
-సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి అన్న ప్రధాని
-దేశంలో ఏ ఒక్కరు పోషకాహార లోపంతో బాధపడకూడదు
-ప్రతి ఇంటికి విద్యుత్, తాగునీరు సుదూర స్వప్నం కాకూడదు
-శతాబ్ది ఉత్సవాల నాటికి దేశాన్ని ప్రబల శక్తిగా మార్చాలి
-జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు కొవిడ్ నుంచి దేశాన్ని రక్షించాయి
-మహాత్మగాంధీ సమాధి వద్ద మోదీ నివాళులు
-ఎర్రకోట వద్ద స్వాగతం పలికిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
-త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ.. జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దేశం కోసం సరిహద్దులో కాపలా కాస్తున్న వీర జవాన్లకు మోదీ ప్రణామాలు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందన్నారు.

కరోనా సంక్షోభం వేళ వైద్యులు, సిబ్బంది అందించిన సేవలను మోదీ కొనియాడారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారు చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు అందించిన క్రీడాకారులపై మోదీ ప్రశంసలు కురిపించారు. దేశానికి వారు పతకాలు మాత్రమే అందించలేదని, యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వారందరికీ దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోందన్నారు.

విభజన సమయంలో దేశ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, బాధలకు గౌరవ సూచకంగా ఆగస్టు 14న ‘విభజన భయానక జ్ఞాపక దినం’ గా జరుపుకోవాలని మోదీ సూచించారు. కొవిడ్‌తో దేశ ప్రజలు సహనంతో పోరాడారని మోదీ పేర్కొన్నారు. ఈ సమయంలో అనే సవాళ్లను ఎదుర్కొన్నామని, అసాధారణ వేగంతో పనిచేశామని గుర్తు చేశారు. ఇది మన పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు అందించిన బలమని అన్నారు. భారతదేశం నేడు టీకాల కోసం ఏ ఇతర దేశంపైనా ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు.

దేశ సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో ఏ ఒక్కరు పోషకాహార లోపంతో బాధపడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ దుకాణాల్లో పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పోషకాహార లోపంతో పాటు వైద్యం కూడా అత్యంత కీలకమైనదని అన్నారు. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్టు చెప్పారు. ప్రతి ఇంటికి విద్యుత్, తాగునీరు సుదూర స్వప్నంగా మిగిలిపోకూడదని అన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలన్నారు. పేదరికానికి కులం, మతం తేడా ఉండకూడదని పేర్కొన్నారు.

ప్రతి పేదవాడు సగర్వంగా నిలబడేలా సహాయ, సహకారాలు అందించాలని మోదీ అన్నారు. శతాబ్ది ఉత్సవాల నాటికి దేశాన్ని ప్రబలశక్తిగా మార్చాలన్న సంకల్పం తీసుకోవాలని మోదీ కోరారు. శతాబ్ది ఉత్సవాలకు మిగిలి ఉన్న ఈ 25 ఏళ్లు అమృత ఘడియలని మోదీ పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రతి పౌరుడు క్షణం కూడా వృథా చేయకుండా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్ యాప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని పేర్కొన్న మోదీ.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 54 కోట్ల మందికి టీకాలు అందించినట్టు తెలిపారు. భారతీయుల జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు కరోనా నుంచి చాలా వరకు రక్షించాయని మోదీ వివరించారు.

ఎర్రకోటపై త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. తొలుత రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించిన మోదీ అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు.

Related posts

నాకు మెడికల్ కాలేజీనే లేదు… దందా ఎలా చేస్తాను?: రేవంత్ పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్…

Drukpadam

నిత్యజీవితంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే విష పదార్థాలు ఇవే!

Drukpadam

అధికారి వేధింపులకు మహారాష్ట్ర ‘లేడీ సింగమ్’ ఆత్మహత్య

Drukpadam

Leave a Comment