ఘనంగా టీయూజేఎఫ్ వార్షికోత్సవం
-ఉర్దూ జర్నలిస్టులకు అవార్డులు
తెలంగాణ ఉర్దూ జర్నలిస్టుల ఫెడరేషన్ ద్వితీయ వార్షికోత్సవ సభ పలువురు ప్రముఖుల సమక్షంలో శుక్రవారం రాత్రి పాతబస్తీ లోని చార్మినార్ వద్ద గల ఉర్దూ మస్కాన్ హాలులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో ముగ్గురు సీనియర్ ఉర్దూ పాత్రికేయులకు అవార్డులను అందించి సత్కరించారు. ఐజేయూ సీనియర్ నాయకులు, టీయూజేఎఫ్ అధ్యక్షులు ఎం.ఏ.మాజిద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, ఇంటర్ మీడిట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, మలక్ పేట్ శాసన సభ్యులు బలాల, ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీలు అతిథులుగా హాజరై ప్రసంగించారు.
దేశంలో ఉర్దూ మీడియా లక్నో, హైదరాబాద్ కేంద్రాల్లోనే అత్యధికంగా ఉందని, ఇందుకుగాను ఇక్కడ ఉర్దూ భాష పట్ల, ఉర్దూ మీడియా పట్ల వివక్షత చూపడం సరైంది కాదని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తమ సంఘం ఉర్దూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అక్రెడిటేషన్ కమిటీల్లో ఉర్దూ జర్నలిస్టుల ప్రాతినిధ్యం లేకుండా చేయడం విచారకరమని విరాహత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉర్దూ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు గాను మీడియా అకాడమీ నుండి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి ఉర్దూ మెటీరియల్ అందించాలని ఆయన కోరారు. రెండు రోజుల క్రితం కిడ్నీలు పాడై మృతి చెందిన నిరుపేద ఉర్దూ పాత్రికేయుడు ఖైసర్ కుటుంబాన్ని ఆదుకోవాలని సభలో విరాహత్ అలీ కోరగా, మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ డిసెంబర్ 15న నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఖైసర్ కుటుంబానికి మీడియా అకాడమీ నుండి ఆర్థిక సహకారం అందించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల సంక్షేమ నిధితో వేలాది బాధిత కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక చేయుతను అందించింది ఆదుకుందని అల్లం నారాయణ స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు ఫైసల్ అహ్మద్, హాబీబ్ జిలాని, తాహెర్ రుమాని, హెచ్.యు.జె నాయకులు రియాజ్ అహ్మద్, గౌస్, రఫీ తదితరులు పాల్గొన్నారు.