ఫైబర్ గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయ్.. కావాలంటే ఇంట్లో ఉన్నవాటిని మార్చుకోవచ్చన్న ఇండేన్.. గ్యాస్ ఎంతున్నదీ తెలుసుకోవచ్చు!
- 10 కిలోలు, 5 కిలోల కేటగిరీలు అందుబాటులోకి
- ఇనుప వాటితో పోలిస్తే బరువు చాలా తక్కువ
- ధర మాత్రం ఎక్కువ.. 10 కిలోల సిలిండర్ కు రూ.3,350
- 5 కిలోల బండ ధర రూ.2,150
ఇంట్లో ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్లన్నీ ఇనుపవే. పై అంతస్థుల్లో ఉండే వారు వాటిని తీసుకెళ్లాలంటే ఎంతో ఇబ్బంది. ఆ శ్రమను తప్పించేందుకు చమురు సంస్థలు కొత్త సిలిండర్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ఇనుముకు బదులు ఫైబర్ తో తయారు చేసిన సిలిండర్లను విడుదల చేశాయి. ప్రస్తుతానికి ఇండేన్ ఈ ఫైబర్ (స్మార్ట్) సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇంట్లో ఇప్పుడు వాడే సిలిండర్లలో గ్యాస్ బరువు 14.2 కిలోలు కాగా.. సిలిండర్ బరువే 16 కిలోల వరకు ఉంటుంది. వీటికి బదులుగానే ఫైబర్ సిలిండర్లను ఇండేన్ తీసుకొచ్చింది. అయితే, ప్రస్తుతానికి 10 కిలోలు, 5 కిలోల సిలిండర్లనే తెచ్చింది. వాటి ధర కూడా ఎక్కువే. 10 కిలోల ఫైబర్ సిలిండర్ కు రూ.3,350 కాగా.. 5 కిలోల సిలిండర్ ధర రూ.2,150గా ఉంది. కావాలనుకునేవారు ఇప్పటికే ఉన్న సిలిండర్లను ఇచ్చేసి ఈ సిలిండర్లను మార్చుకోవచ్చని ఇండేన్ సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో జరుగుతున్న ‘గో ఎలక్ట్రిక్ ఎక్స్ పో’లో భాగంగా వీటిని సంస్థ ప్రదర్శించింది. బుక్ చేసుకున్న గంటల్లోనే ఇంటికి పంపిస్తామని అధికారులు చెప్పారు. 10 కిలోల సిలిండర్ లో రూ.670, 5 కిలోల సిలిండర్ లో రూ.330 పెట్టి గ్యాస్ ను నింపుకోవచ్చని తెలిపారు.
ఫైబర్ సిలిండర్ తో ఇవీ లాభాలు
- బరువు తక్కువ. గరిష్ఠంగా 6.3 కిలోలు (గ్యాస్ లేకుండా)
- మామూలు సిలిండర్లలో గ్యాస్ కనిపించదు. వీటిలో కనిపిస్తుంది. కాబట్టి గ్యాస్ ఎప్పుడు అయిపోయేది మనం తెలుసుకునేందుకు వీలుంటుంది.
- ఇనుప సిలిండర్ కు మంటలు అంటుకుంటే పేలే ప్రమాదం ఉంటుంది. కానీ, ఫైబర్ సిలిండర్ తో ఆ ప్రమాదం ఉండదు.
- ఇనుప సిలిండర్ తుప్పు పట్టి పాడవుతుంది. మరకలూ పడతాయి. ఫైబర్ సిలిండర్ లో ఈ సమస్యలుండవు.