జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 9 మంది మృతి
పీఎం గవర్నర్ , సీఎం దిగ్బ్రాంతి …రాష్ట్రం ప్రభుత్వం 5 లక్షలు ,కేంద్రం 2 లక్షల పరిహారం
డ్రైవర్ తో సహా తొమ్మది మంది మృతి …పలువురికి గాయాలు ..
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ఉన్నట్లు తెలుస్తోంది. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు మృతదేహాలను వెలికితీస్తున్నారు.
ఏపీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించిన మోదీ
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం కలచివేస్తోందని చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఆయన ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నారు.
మరోవైపు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి జంగారెడ్డిగూడెంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
బస్సు ప్రమాద సంఘటన పట్ల గవర్నర్ విచారం
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.
జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. అశ్వారావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చిన్నారావుతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరి పరిస్ధితి విషమంగా ఉండటం బాధాకరమని గవర్నర్ పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన గవర్నర్ హరిచందన్ సహాయ చర్యలు వేగవంతం చేసి మృతుల సంఖ్య పెరగకుండా చూడాలన్నారు…
బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై సీఎం వైయస్.జగన్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.