రేపు విశాఖలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్ లో పాల్గొననున్న సీఎం జగన్
- శుక్రవారం విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్
- పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న సీఎం
- పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరుకానున్న వైనం
ఏపీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల కార్యక్రమాలతో పాటు నగరంలో పలు ప్రైవేటు కార్యక్రమాలకు కూడా సీఎం జగన్ హాజరుకానున్నారు. శుక్రవారం సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విశాఖ బయల్దేరతారు.
విశాఖ చేరుకున్న అనంతరం… సాయంత్రం 5.20 గంటలకు ఎన్ఏడీ జంక్షన్ వద్ద నిర్మించిన ఎన్ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్డీయే అభివృద్ధి చేసిన 6 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్య వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం 6.20 గంటలకు వుడా పార్క్ తో పాటు జీవీఎంసీ అభివృద్ధి చేసిన 4 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
రాత్రి 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు. రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు పయనం అవుతారు.
కాగా, సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సీఎం వస్తుండడంతో ఆయన ఇవాళ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ తో కలిసి ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్డీయే పార్కు ప్రాంతాలను పరిశీలించారు.