సీఎం జగన్ మూడురోజుల కడప పర్యటన …భద్రత కట్టుదిట్టం!
-రేపటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన..
-వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్
-క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్న సీఎం
-పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
-సీఎం రాకతో ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు కడప జిల్లాలో పలు కార్యక్రమాల్లోనూ, క్రిస్మస్ వేడుకల్లోనూ ఆయన పాల్గొంటారు. ఈ నెల 23 ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అదే రోజున బొల్లవరం, బద్వేలు, కొప్పర్తిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తారు. సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకుని రాత్రికి అక్కడే విశ్రమిస్తారు.
ఈ నెల 24వ తేదీన తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇడుపులపాయ ప్రార్థనమందిరంలో జరిగే ప్రార్థనలకు కూడా సీఎం జగన్ హాజరవుతారు. అనంతరం, పులివెందులలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. తిరిగి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
ఇక, ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా పులివెందుల ఈఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాణిజ్య సముదాయాన్ని ప్రారంభిస్తారు. అటు తర్వాత విజయాగార్డెన్స్ లో సారెడ్డి వరప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యుల పెళ్లి రిసెప్షన్ కు హాజరుకానున్నారు. ఆపై భాకరాపురంలోని సొంత నివాసానికి వెళ్లి కాసేపు విశ్రమించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి చేరుకుని గన్నవరం తిరుగుపయనమవుతారు.
కాగా సీఎం జగన్ మూడు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని కడప జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు నుంచి బద్వేలు వైపు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు మినహాయించి ఇతర వాహనాలను దారిమళ్లించనున్నట్టు వివరించారు. ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు.
నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఇతర జిల్లాలకు వెళ్లే లారీలు, కార్లు, ఇతర వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఎస్పీ సూచించారు. నెల్లూరు జిల్లాకు వెళ్లేవారు రాజంపేట, చిట్వేల్ మీదుగా వెళ్లొచ్చని… ఒంగోలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళ్లేవారు పోరుమామిళ్ల మీదుగా వెళ్లొచ్చని పేర్కొన్నారు.
నెల్లూరు వెళ్లాలనుకునేవారు, నెల్లూరు నుంచి బద్వేలుకు రావాలనుకునేవారు శ్రీనివాసపురం, గోపవరం, లింగసముద్రం, బేతాయపల్లి, బెడుసుమల్లి, పీపీ కుంట మీదుగా నెల్లూరు వెళ్లొచ్చని తెలిపారు.