సినిమా టికెట్ల వ్యవహారం.. రంగంలోకి చిరంజీవి.. త్వరలో జగన్ ను కలవనున్న మెగాస్టార్!
-టికెట్ ధరలను పెంచుకోవడానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
-ఏపీలో ఇంకా తెగని టికెట్ ధరల పంచాయతీ
-జగన్ తో చర్చలు జరపడానికి సిద్ధమవుతున్న చిరంజీవి
ఏపీలో సినిమా టికెట్స్ వ్యవహారం ముదిరింది. ఇప్పటికే అనేక థియటర్లు మూతపడ్డాయి. టికెట్స్ రేట్లు తగ్గించాల్సిందేనని ప్రభుత్వం ,పెంచాలని లేకపోతె సినీపరిశ్రమకు ఇబ్బందులు తప్పవని సినీ రంగ ప్రముఖులు పేర్కొంటున్నారు. కొంతమంది హీరోలు నేరుగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కారాలు మిర్యాలు నూరుతున్నారు. దీనిపై ఏపీ మంత్రులుకూడా దీటుగానే స్పందిస్తుంది. ఇది ఇలానే కొనసాగితే సినీపరిశ్రమకు , ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరగటం మంచిది కాదని మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగ నున్నారు. తెలంగాణ ప్రభుత్వం టికెట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఏమి చేయనున్నాడనేది ఆశక్తిగా మారింది.
సినిమా టికెట్ ధరలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో మాత్రం థియేటర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తనిఖీల పేరుతో థియేటర్ యజమానుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇప్పటికే ఏపీలో పలు థియేటర్లు మూతపడ్డాయి.
తగ్గించిన ధరలకే టికెట్లు అమ్మాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. టికెట్ ధరలు తక్కువగా ఉంటే గిట్టుబాటు కాదని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను త్వరలోనే చిరంజీవి కలవనున్నారని విశ్వసనీయ సమాచారం. దీనికంటే ముందు మంత్రి పేర్ని నానిని కలిసి టికెట్ ధరల వ్యవహారం, చిత్ర పరిశ్రమ సమస్యలపై ఆయన చర్చించనున్నారు. ఆ తర్వాత జగన్ ను కలిసి చర్చలు జరపనున్నారు. టికెట్ ధరలను తగ్గించడంపై పునరాలోచించాలని కోరనున్నారు.
ఈ మధ్యనే తెలంగాణ సీఎం కేసీఆర్ ను పలువురు సినీ ప్రముఖులతో పాటు చిరంజీవి కూడా కలిశారు. ఇండస్ట్రీ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించిన కేసీఆర్ టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతించారు. ఈ నేపథ్యంలో జగన్ ను కూడా కలిసి పరిస్థితిని చక్కదిద్దాలని చిరంజీవి భావిస్తున్నారు.