సూసైడ్ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవ…
-తనకేపాపం తెలియదంటున్న రాఘవ
-పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య
-సూసైడ్ నోట్ లో ఎమ్మెల్యే తనయుడి పేరు!
-ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
-పరారీలో ఎమ్మెల్యే తనయుడు
-వీడియో విడుదల చేసిన వైనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ లో టీఆర్ యస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాఘవేందర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పాల్వంచ ఏఎస్పీ తెలిపారు.
ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్ ఓ వీడియో ద్వారా స్పందించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తన జోక్యం లేకపోయినా తన పేరు ఎందుకు రాశారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమది రాజకీయ కుటుంబం అని, పనుల కోసం వందలమంది వస్తారని వివరించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక చనిపోతే నాకేంటి సంబంధం? అని రాఘవేందర్ ప్రశ్నించారు.
ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని నిరూపితమైతే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని రామకృష్ణకు చెప్పడం నేరమా? అని ఆక్రోశించారు.
ఈ కేసులో తనను ఇరికించేందుకు కొందరు కుట్ర చేశారని రాఘవేందర్ ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు పథకం ప్రకారం చేశారని అన్నారు. తనను అభాసుపాలు చేసేందుకు రామకృష్ణను ప్రలోభపెట్టారని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. దీనిపై రాఘవ అభిమానులు సైతం స్పందించారు. అందరికి అందుబాటులో ఉంటూ ప్రతి చిన్న విషయాన్నీ తన భుజాలపై వేసుకొని ప్రజలకు నేనున్నానని దైర్యం ఇచ్చే రాఘవపై అనవసరంగా కేసు నమోదు చేయడంపై మండిపడుతున్నారు. పోలీసులు న్యాయంగా విచారణ జరిపి రాఘవ పేరు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సూసైడ్ నోట్ లో తనపేరు ఉన్నాడని తెలుసుకున్న రాఘవ తప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
పాత పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య… పరారీలో ఎమ్మెల్యే కుమారుడు
- భార్య, కుమార్తెల సహా ఓ వ్యక్తి ఆత్మహత్య
- ముగ్గురి మృతి.. కాలిన గాయాలతో ఆసుపత్రిపాలైన ఒక చిన్నారి
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడిపై ఎఫ్ఐఆర్ నమోదు
కాగా, రామకృష్ణ కారు నుంచి క్లూస్ టీమ్ కొన్ని కీలక కాగితాలు, బిల్లులను స్వాధీనం చేసుకుంది. తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన పోలీసులు, ఆపై ఇది ఆత్మహత్యేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు. గ్యాస్ లీకేజి ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.
కాగా, ఈ ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాఘవేందర్ ఆచూకీ తెలియలేదని, అతడు పరారీలో ఉన్నాడని పాల్వంచ పోలీసులు వెల్లడించారు. కాగా, గతంలో ఓ ఫైనాన్షియర్ ఆత్మహత్యకు కూడా రాఘవేందర్ కారకుడన్న ఆరోపణలు వచ్చాయి.