ఎన్నికల కమిషన్, కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉచిత హామీలు తీవ్రమైన అంశమని పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికలకు ముందు ప్రజానిధులతో ఉచిత తాయిలాలు పంచిపెడుతూ, ఉచిత హామీలిస్తున్న పార్టీల ఎన్నికల గుర్తును స్తంభింప చేయాలని, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని బీజపీ నేత, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీం ధర్మాసనం మంగళవారంనాడు విచారణ జరిపింది.భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, న్యాయవాదులు ఏఎస్ బోపన్న, హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.
ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని ఎలా అదుపు చేయాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లోపే ఇది చేయగలమా? వచ్చే ఎన్నికలకు చేయగలమా? ఇది చాలా తీవ్రమైన అంశం. ఉచిత హామీల బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్‌ను మించిపోతోంది అని సీజేఐ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. ఓటర్ల నుంచి రాజకీయ లబ్ధి పొందటం కోసం అనుసరిస్తున్న జనాకర్షణ విధానాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై నిషేధం విధించాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.