కొత్త జిల్లాల ఏర్పాటుకు స్వాగతిస్తున్నాం … హిందూపురం ను జిల్లా కేంద్రంగా చేయాలి :బాలకృష్ణ
-ప్రతిపార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలి
-ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు
-హిందూపురం ప్రస్తావన తీసుకువచ్చిన బాలయ్య
-హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని విజ్ఞప్తి
పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇవాళ ఆయనొక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. హామీ ఇచ్చిన మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తోందని, వాణిజ్య, పారిశ్రామికంగా ముందంజ వేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంను కేంద్రంగా చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హిందూపురం పట్టణం పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి, భవిష్యత్ అవసరాల కోసం కావాల్సిన ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. జిల్లా ఏర్పాటులో రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేశారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి, వారి చిరకాల కోరిక అయిన హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని కోరారు.
కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి: తెలంగాణ నేత వీహెచ్ డిమాండ్
ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లాలు, జిల్లాల కేంద్రాలపై ఇప్పటికే పలు కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు తెలంగాణ నుంచి కూడా ఓ డిమాండ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఎంతో చేశారని వీహెచ్ కొనియాడారు. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య పేరును ఆ జిల్లాకు పెట్టాలని చెప్పారు. కడపకు వైయస్సార్, విజయవాడకు ఎన్టీఆర్, మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన జగన్ కు… దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలనే ఆలోచన రాకపోవడం సిగ్గు చేటని అన్నారు. జగన్ దీనిపై పునరాలోచించాలని.. కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలని సూచించారు.
ఎన్టీఆర్ పేరును ఆ జిల్లాకు పెట్టాలంటున్న రచయిత చలపాక ప్రకాశ్
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు ఎన్డీఆర్ పేరును ప్రభుత్వం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లా పేరులో సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కవి, రచయిత చలపాక ప్రకాశ్ కోరారు.
తెలుగు నేలకు, భాషకు, చలనచిత్ర రంగానికి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. జిల్లాకు అలాంటి మహనీయుడి పేరును పెట్టడం సంతోషకరమని చెప్పారు. అయితే విజయవాడ పట్టణాన్ని తాకుతూ కృష్ణా నది ప్రవహిస్తోందని… ఇక్కడి ప్రజలకు కృష్ణా నదితో ఎంతో అనుబంధం ఉందని అన్నారు. అందువల్ల ఈ జిల్లాకు కృష్ణా జిల్లా అనే పేరు పెట్టాలని, మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు. ఒకవేళ విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిసైడ్ అయినట్టయితే… ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టాలని ఆయన కోరారు.
ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించింది: కొత్త జిల్లాల ఏర్పాటుపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశంస
- రాయలసీమకు సాగరతీరం కలపడం మంచిది
- ఈ నిర్ణయం అభినందనీయం
- నూతన ఆంధ్ర ప్రదేశ్ కు శుభాకాంక్షలు
”కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు సాగరతీరం కలపడం ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించింది. ఈ నిర్ణయం అభినందనీయం. నూతన ఆంధ్రప్రదేశ్ కు శుభాకాంక్షలు” అని విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.