మోదీ ప్రభుత్వానిది దేశ ద్రోహమే: రాహుల్ గాంధీ!
- పెగాసస్ కథనంపై స్పందన
- ప్రజలపై నిఘా పెట్టేందుకు కొనుగోలు చేసిందని ఆరోపణ
- దేశాన్ని శత్రువులా చూస్తున్నారంటూ ఖర్గే ఆగ్రహం
పెగాసస్ ను 2017లోనే భారత్ కొనుగోలు చేసిందన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశ నాయకులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పెగాసస్ ను కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అధికార పార్టీలోని నేతలతో పాటు విపక్ష నేతలనూ లక్ష్యంగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టులపైనా నిఘా పెట్టారని, అందరి ఫోన్లనూ ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఇది దేశ ద్రోహమేనని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం దేశద్రోహం చేసిందని రాహుల్ విమర్శించారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా దానిపై స్పందించారు. సొంత ప్రజలపైనే మోదీ ప్రభుత్వం ఎందుకు నిఘా పెడుతోందని, దేశాన్ని ఎందుకు శత్రువులా చూస్తున్నదని ప్రశ్నించారు. అక్రమంగా నిఘా పెట్టడం దేశద్రోహం కిందే లెక్కని మండిపడ్డారు. ఎవరూ చట్టానికి అతీతులు కాదని, న్యాయం జరిగేదాకా పోరాడుతామని స్పష్టం చేశారు.