టీకా నా కుమార్తె ఉసురు తీసింది.. రూ. 1000 కోట్లు చెల్లించాలి: బాంబే హైకోర్టును ఆశ్రయించిన తండ్రి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా సురక్షితమని చెప్పాయి
- డీసీజీఐ, ఎయిమ్స్ డైరెక్టర్, కేంద్రం దుష్ప్రచారం వల్లే నా కుమార్తె టీకా వేసుకుంది
- టీకా దుష్ప్రభావం వల్లే చనిపోయింది
- ఏఈఎఫ్ఐ కమిటీ కూడా ఇదే చెప్పింది
- రూ. 1000 కోట్లు పరిహారంగా చెల్లించేలా ఆదేశించండని కోరిన పిటిషనర్ లునావత్
కరోనా నియంత్రణకు ప్రభుత్వం వేసిన టీకా వల్ల తన కుమార్తె ప్రాణం పోయిందని, ఇందుకు గాను పరిహారంగా రూ. 1000 కోట్లు చెల్లించాలంటూ ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాల్లోకి వెళ్తే.. నాసిక్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న స్నేహాల్ గతేడాది జనవరి 28న కొవిషీల్డ్ టీకా వేసుకున్నారు. మార్చి 1న మరణించారు. తన కుమార్తె టీకా దుష్ప్రభావాల కారణంగానే మరణించిందని ఆమె తండ్రి లునావత్ కోర్టును ఆశ్రయించాడు. ఆమెకు న్యాయం కావాలని కోరాడు.
ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని, అది పూర్తి సురక్షితమని, ఎలాంటి హానీ ఉండదని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతోనే తన కుమార్తె టీకా వేసుకుందని లునావత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. టీకా పూర్తి సురక్షితమని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ తప్పుడు ప్రచారం వల్లే తన కుమార్తె, మరెంతోమంది ఆరోగ్య కార్యకర్తలు టీకా తీసుకున్నారని పేర్కొన్నారు.
టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాల కారణంగా తన కుమార్తె చనిపోయిందని లునావత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఈఎఫ్ఐ కమిటీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. కాబట్టి, పరిహారంగా 1000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం, సీరం సంస్థలను ఆదేశించాలని లునావత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గత వారమే ఆయన ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, విచారణకు ఇంకా తేదీ ఖరారు కాలేదు.