100 అడుగుల బోరు బావిలో ఐదు రోజులు అల్లాడిన ఐదేళ్ల పసిప్రాణం
- మొరాకోలోని షెఫ్షావూలో విషాదం
- కాపాడలేకపోయిన అధికారగణం
- బోరుబావికి సమాంతరంగా సొరంగం
బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడు ఐదు రోజుల పాటు దాంట్లోనే అల్లాడిపోయాడు. పైకి లాగాలంటూ ఆ చిన్నారి వేసిన కేకలు ప్రాణాల్ని కాపాడలేకపోయాయి. సహాయక సిబ్బంది ఆ చిన్నారిని చేరుకునేలోపే నష్టం జరిగిపోయింది. ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన మొరాకోలోని షెఫ్షావూలో జరిగింది.
రయాన్ అవ్రామ్ అనే ఐదేళ్ల చిన్నారి.. మంగళవారం ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 32 మీటర్ల లోతైన బోరుబావిలో పడిపోయాడు. పిల్లాడు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తప్పిపోయాడేమోనని అంతా వెతికారు. అయితే, సమీపంలోని బోరు బావి నుంచి కేకలు వినిపిస్తుండడంతో అప్రమత్తమైన స్థానికులు.. వారి తల్లిదండ్రులను పిలిచారు. లైట్లు వేసి చూశారు. తనను పైకి లాగాలంటూ ఆ చిన్నారి ఆర్తనాదాలు చేశాడు.
వెంటనే అధికారులకు సమాచారమివ్వగా వారొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల పాటు ఆపరేషన్ సాగింది. పిల్లాడికి గొట్టం ద్వారా తిండి, నీళ్లు, ఆక్సిజన్ పంపించారు. పిల్లాడిని బతికించేందుకు బోరుబావికి సమాంతరంగా అధికారులు సొరంగం తవ్వి బాలుడు పడిన చోటుకు చేరుకున్నారు. అయినా పిల్లాడిని బతికించలేకపోయారు. విగత జీవిగా మారిన తమ బిడ్డను చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఘటన గురించి తెలిసి మొరాకో రాజు మహ్మద్ సంతాపం తెలిపారు.