పిల్లల కోసం పెళ్లికైనా, సహజీవనానికైనా రెడీ: కరాటే కల్యాణి
- నాకు ఇప్పటి వరకు నిజమైన ప్రేమ దొరకలేదు
- సరైన అబ్బాయి దొరికితే మూడో పెళ్లికి నేను సిద్ధం
- పిల్లల్ని కనాలన్న నా కోరిక ఇంకా తీరలేదు
టాలీవుడ్ లో కరాటే కల్యాణిది ఒక ప్రత్యేకమైన స్థానం. కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా, సామాజిక సమస్యలపై కూడా ఆమె తన గొంతుకను బలంగా వినిపిస్తుంటారు. అన్యాయానికి గురైన వారి పక్షాన నిలబడుతూ వారి కోసం పోరాటం చేయడానికి ఆమె వెనకడుగు వేయరు. ఆమె వ్యక్తిగత జీవితం కూడా అందరికీ తెలిసిందే. అందరూ బాగుండాలని కోరుకునే కల్యాణి జీవితంలో కావాల్సినంత విషాదం ఉంది. ఇప్పటి వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె… తన భర్తలతో విడిపోయారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను అంటే ఏమిటనేది అందరికీ తెలుసని చెప్పారు. భార్య అంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదని, తాను అలాంటి మహిళను కాదని అన్నారు. తాను నిప్పునని, అందుకే తన వైవాహిక జీవితాలు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. తనను వాళ్లు అర్థం చేసుకోలేదని… గొడవలతో విసిగిపోయి విడాకులు తీసుకున్నానని అన్నారు. ఇప్పుడు ఒంటరిగా హ్యాపీగా ఉన్నానని తెలిపారు.
తనకు ఇంత వరకు జీవితంలో నిజమైన ప్రేమ దొరకలేదని… తనకు నిజమైన ప్రేమ దొరికితే మూడో పెళ్లికి సిద్ధమని కల్యాణి చెప్పారు. సరైన అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి తాను సిద్ధమని, సహజీవనానికైనా రెడీ అని తెలిపారు. పిల్లల కోసమే రెండు సార్లు పెళ్లి చేసుకున్నానని, ఆ ఆశ ఇంకా తీరలేదని, ఆ కోరిక తీరాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు.