అబ్బాయిది ఆంధ్రా… అమ్మాయిది తమిళనాడు… ఎట్టకేలకు ఒక్కటయ్యారు!
- వైద్య విద్య కోసం రష్యా వెళ్లిన అనంత్ కుమార్, సెల్సియా
- అనంత్ కుమార్ స్వస్థలం సత్తెనపల్లి
- సెల్సియా తమిళనాడుకు చెందిన అమ్మాయి
- పెళ్లికి ఒప్పుకోని అమ్మాయి తల్లిదండ్రులు
సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన అనంత్ కుమార్, తమిళనాడులోని మధురైకి చెందిన వైద్య విద్యను అభ్యసించేందుకు రష్యా వెళ్లారు. అక్కడ ఓ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమ వ్యవహారాన్ని అనంత్ కుమార్ తల్లిదండ్రులు బుర్రమ్మ, నరసింహారావులకు తెలియజేశాడు. వారు కొడుకు ప్రేమను ఆశీర్వదించారు. అయితే సెల్సియా తల్లిదండ్రులు ఇందిర, గుణశీలన్ మాత్రం ఈ ప్రేమను అంగీకరించలేదు. దాంతో అతడి ప్రేమ వ్యవహారం అనిశ్చితిలో పడింది.
ఇటు, అనంత్ కుమార్ వైద్య విద్య పూర్తయింది. దాంతో అతడి తల్లిదండ్రులు తమ కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన సెల్సియా సత్తెనపల్లికి చెందిన అడ్వొకేట్, జనసేన గుంటూరు జిల్లా కార్యదర్శి వెంకట సాంబశివరావును వాట్సాప్ ద్వారా సాయం కోరింది. ఆయన ఈ విషయాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ ఉమేశ్ కు వివరించారు.
దీనిపై స్పందించిన పోలీసులు పెళ్లి విషయంలో తొందరపడొద్దని అనంత్ కుమార్ కుటుంబానికి సూచించారు. దాంతో, చివరి ప్రయత్నంగా అనంత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో సెల్సియా తండ్రితో మాట్లాడించాడు. అయినప్పటికీ వారు పెళ్లికి ససేమిరా అన్నారు. సెల్సియా కుటుంబం అంగీకరించకపోవడంతో వేరే సంబంధాలు చూశారు. ఈ నెల 6న చెన్నైలోని ఓ తెలుగు కుటుంబానికి చెందిన యువతితో అనంత్ కుమార్ నిశ్చితార్థం జరిగింది.
ఈ విషయం తెలిసిన సెల్సియా ఎంతో కష్టపడి రష్యా నుంచి హుటాహుటీన సత్తెనపల్లి చేరుకుంది. ఆమెకు జనసేన వీరమహిళ పుష్పలత నామాల ఆశ్రయం కల్పించారు. కాగా, అప్పటికే అనంత్ కుమార్ కు నిశ్చితార్థం జరగ్గా, చెన్నై తెలుగు కుటుంబానికి విషయం వివరించి వారిని ఒప్పించారు. ఈ నేపథ్యంలో, అనంత్ కుమార్ కు, సెల్సియాకు సత్తెనపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి జరిగింది. ఈ వివాహానికి జనసేన పార్టీ నాయకులు విశేష సహకారం అందించారు.
కాగా, ఈ పెళ్లి విషయం తెలియడంతో సెల్సియా కుటుంబ సభ్యులు మధురై నుంచి సత్తెనపల్లి చేరుకున్నారు. అయితే, సీఐ ఉమేశ్ వారికి పరిస్థితిని వివరించారు. ఈ వివాహం చట్టబద్ధంగానే జరిగిందని, పెద్దవాళ్లు కూడా అంగీకరిస్తే బాగుంటుందని వారికి సూచించారు.